breaking news
Building Materials
-
ఇల్లే కాదు.. ఇంటి నిర్మాణ సామగ్రికీ గుర్తింపు
సాక్షి, సిటీబ్యూరో: కాలం ఏదైనా సరే ఇంట్లో నీరు, విద్యుత్ వినియోగం తప్పనిసరి. వేసవికాలంలో అయితే వీటి బిల్లులతో కస్టమర్ల జేబుకు చిల్లులు పడటం ఖాయం. అందుకే హరిత నిర్మాణ సామగ్రితో నిర్మించే ఇళ్లకు ఆదరణ పెరుగుతోంది. హరిత భవనాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు విద్యుత్ వినియోగం 30–40 శాతం, నీటి వినియోగం 20–30 శాతం తగ్గుతుంది కూడా.విద్యుత్, నీటి బిల్లుల ఆదా, నిర్వహణ వ్యయం తగ్గింపు, ఆరోగ్యకరమైన వాతావరణ వంటి కారణాలతో హరిత భవనాలకు డిమాండ్ పెరిగింది. గతంలో పర్యావరణహితమైన ఇల్లు కొనాలంటే కాలుష్యం, జనాభా తక్కువగా ఉండే ప్రాంతాలకు లేక శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ, నేడు నగరంలో, హాట్‌సిటీలో ఉంటూ కూడా హరిత భవనాలు కావాలంటున్నారు కొనుగోలుదారులు. దీంతో నిర్మాణ సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన గృహాలనే కాదు.. ఐజీబీసీ గుర్తింపు పొందిన నిర్మాణ సామాగ్రిని, ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. మార్కెట్లో 350 రకాల ఉత్పత్తులు.. నివాసాలకు, వాణిజ్య, కార్యాలయాల సముదాయాలకూ హరిత భవనాల గుర్తింపునివ్వటం మనకు తెలిసిందే. కానీ, దేశంలో తొలిసారిగా నిర్మాణ సామగ్రి ఉత్పత్తులకూ గుర్తింపు ప్రారంభించింది సీఐఐ. దీంతో కొనుగోలుదారులకు గృహాల్లోనే కాకుండా నిర్మాణ సామగ్రిలోనూ గ్రీన్ ప్రొ సర్టిఫికెట్ పొందిన ఉత్పత్తులను ఎంపిక చేసుకునే వీలుందన్నమాట. ఇప్పటి వరకు 350 ఉత్పత్తులు గ్రీన్ సర్టిఫికెట్ పొందాయి. ఏసీసీ సిమెంట్, నిప్పన్ పెయింట్స్, సెయింట్ గోబియన్ గ్లాస్, అసాహి ఇండియన్ గ్లాస్, గోద్రెజ్ ఫర్నీచర్, విశాఖ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. దేశంలో గ్రీన్ బిల్డింగ్స్ ఉత్పత్తుల మార్కెట్ రూ.18 లక్షల కోట్లుగా ఉందని అంచనా. -
ఇళ్ల ధరలకు ఈ ఏడాది రెక్కలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు రెక్కలు విప్పుకోనున్నాయి. సుమారు 30 శాతం మేర పెరుగుతాయని ఎక్కువ మంది డెవలపర్లు భావిస్తున్నారు. ప్రధాన కారణం బిల్డింగ్ మెటీరియల్స్ (నిర్మాణంలో వినియోగించే ఉత్పత్తులు) ధరలు గణనీయంగా పెరగడం వల్ల నిర్మాణ వ్యయం కూడా అధికమైనట్టు వారు చెబుతున్నారు. ఇది ధరలపై ప్రతిఫలిస్తుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ‘రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సెంటిమెంట్ సర్వే 2022’ పేరుతో ఒక సర్వేను 2021 డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 11 మధ్య నిర్వహించింది. సర్వేలో 1,322 మంది డెవలపర్లు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సర్వే అంశాలు ► 60 శాతం మంది డెవలపర్లు 2022లో ఇళ్లు/ఫ్లాట్ల ధరలు కనీసం 20 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు పెరగడం వల్లేనని వీరు చెప్పారు. ► ధరలు 10–20 శాతం మధ్య పెరగొచ్చని 35 శాతం మంది అంచనాగా ఉంది. ► 25 శాతం మంది ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ► మరో 21 శాతం మంది అయితే ధరల పెరుగుదల 30 శాతం వరకు ఉండొచ్చన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. ► నిర్మాణ వ్యయాలను తగ్గించడం, జీఎస్టీపై ఇన్పుట్ క్రెడిట్ (రుణాలు) అందించడం, రుణ లభ్యతను పెంచడం, ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా మంజూరు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని డెవలపర్లు కోరుతున్నారు. ► 92 శాతం మంది ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా 96 శాతం మంది నివాస ప్రాజెక్టులను చేపట్టేందుకే ఆసక్తి చూపించారు. ► 55 శాతం మంది వ్యాపారంలో వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి ‘‘కరోనా మూడో విడత కొనసాగుతుండడంతో ఈ మహమ్మారి ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం’’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ హర్‡్షవర్ధన్ పటోడియా అన్నారు. చాలా మంది డెవలపర్లు డిజిటల్ టెక్నాలజీకి మళ్లడంపై దృష్టి సారించారని, దీంతో ఆన్లైన్ విక్రయాలు పెరిగినట్టు చెప్పారు. ‘‘39 శాతం డెవలపర్లు 25 శాతం అమ్మకాలను ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఈ ఏడాది ఆన్లైన్ అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని పటోడియా చెప్పారు. -
అల్ట్రాటెక్ లాభం రూ. 838 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చి(క్యూ4) కాలానికి సిమెంట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ 15.5% అధికంగా రూ. 838 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఇతర వ్యయాలను అదుపు చేయడం వంటి చర్యల ద్వారా లాభదాయకతను మెరుగుపరచుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీటికితోడు నికర అమ్మకాలు రూ. 5,391 కోట్ల నుంచి రూ. 5,832 కోట్లకు పెరగడం కూడా ఇందుకు దోహదపడింది. ప్రధానంగా బిల్డింగ్ మెటీరియల్స్ విక్రయాలు పుంజుకున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ సిమెంట్ తయారీ సామర్థ్యం 53.95 మిలియన్ టన్నులుకాగా, 12.18 మిలియన్ టన్నుల గ్రే సిమెంట్, క్లింకర్లను విక్రయించింది. గతేడాది క్యూ4 అమ్మకాలతో పోలిస్తే ఇవి 9% అధికం. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 9 డివిడెండ్‌ను ప్రకటించింది. సిమెంట్ విక్రయాలు అప్ క్యూ4లో సిమెంట్ తదితరాల విక్రయాలు 2.92 లక్షల టన్నుల నుంచి 3.29 లక్షల టన్నులకు పెరిగాయి. కాగా, ముడిసరుకులు, విద్యుత్, రవాణా తదితర వ్యయాలు కూడా రూ. 4,987 కోట్లకు పెరిగాయి. ఇక పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 2,655 కోట్ల నుంచి రూ. 2,144 కోట్లకు క్షీణించింది. అమ్మకాలు దాదాపు యథాతథంగా రూ. 20,203 కోట్ల వద్దే నిలిచాయి. ఈ కాలంలో 41.47 మిలియన్ టన్నుల సిమెంట్, క్లింకర్లను విక్రయించింది. బొగ్గు దిగుమతి వ్యయాలు తగ్గినప్పటికీ, రూపాయి విలువ క్షీణించడంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదని కంపెనీ వివరించింది. విస్తరణ ప్రణాళికలపై రూ. 10,000 కోట్లను వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు 1.4% తగ్గి రూ. 2,170 వద్ద ముగిసింది.