కనిష్ట స్థాయిల నుంచి రికవరీ

Sensex falls over 60 points, Nifty ends flat at 14,634 - Sakshi

సెన్సెక్స్‌ మైనస్, నిఫ్టీ ప్లస్‌

కలిసొచ్చిన రూపాయి ర్యాలీ 

ఆదుకున్న మెటల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు

బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో అమ్మకాలు

ముంబై: మిడ్‌సెషన్‌ నుంచి మెటల్, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు సోమవారం కనిష్టస్థాయిల నుంచి రికవరీ అయ్యాయి. ఉదయం సెషన్‌లో 754 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్‌ చివరికి 64 పాయింట్ల నష్టంతో 48,719 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 215 పాయింట్ల పతనం నుంచి తేరుకొని మూడు పాయింట్ల స్వల్ప లాభంతో 14,416 వద్ద ముగిసింది. రూపాయి బౌన్స్‌ బ్యాక్‌ ర్యాలీ సూచీల నష్టాల రికవరీకి తోడ్పాటును అందించింది. మిశ్రమ అంతర్జాతీయ పరిణామాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బ్యాంకింగ్, ఆర్థిక షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ షేరు పతనంతో సూచీలు ఇంట్రాడేలో భారీ పతనాన్ని చవిచూశాయి. మిడ్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాలు జరగ్గా, చిన్న, లార్జ్‌ క్యాప్‌ షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 2,289 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.553 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.

ఆదుకున్న మిడ్‌సెషన్‌ కొనుగోళ్లు ....  
దేశంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్, లాక్‌డౌన్‌ విధింపు యోచనలు, ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం తదితర అంశాలు దేశీయ మార్కెట్లో బలహీన సంకేతాలను నెలకొన్నాయి. దీంతో ఉదయం స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 426 పాయింట్ల నష్టంతో 48,356 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లను కోల్పోయి 14,631 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకింగ్‌ షేర్లతో పాటు రిలయన్స్‌ షేరులో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు మరింత పతనాన్ని చవిచూశాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. సెన్సెక్స్‌ 754 పాయింట్లను కోల్పోయి 48,028 వద్ద చేరుకుంది. నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 14,416 వద్ద దిగివచ్చింది. ఉదయం సెషన్‌లో అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలకు మిడ్‌సెషన్‌లో కొనుగోళ్ల ఉపశమనం లభించింది. మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా సూచీలు ఇంట్రాడే కనిష్ట స్థాయిల నుంచి నష్టాలను పూడ్చుకోగలిగాయి.  

ఐపీఓకు కెంప్లాస్ట్‌ సన్మార్‌...  
ప్రత్యేక రసాయనాల తయారీ సంస్థ కెంప్లాస్ట్‌ సన్మార్‌ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోసం సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.1,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అలాగే ప్రమోటర్లు ఆఫర్‌ సేల్‌ పద్ధతిలో రూ.2000 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. తద్వా రా కంపెనీ రూ.3,500 కోట్ల సమీకరించాలని భావిస్తోంది. సమీకరించిన నిధుల్లో రూ.1,238 కోట్లను ముందస్తుగానే ఎన్‌సీడీలను ఉపసంహరించుకునేందుకు వినియోగిస్తామని కంపెనీ డ్రాఫ్ట్‌ పేపర్లలో తెలిపింది.  ఈ కంపెనీ షేర్లు స్టాక్‌ ఎక్సే్చంజీల నుంచి వైదొలగి పదేళ్లు కావొస్తుంది. చెన్నై ఆధారిత ఈ కంపెనీ వ్యవసాయ, ఫార్మా రంగాలకు వినియోగించే ప్రత్యేక రసాయనాలకు తయారు చేస్తోంది.

యస్‌ బ్యాంక్‌ షేర్లకు క్యూ4 ఫలితాల సెగ...
యస్‌ బ్యాంకు షేరు సోమవారం నాలుగు శాతం పతనమై రూ.13.91 వద్ద ముగిసింది. మార్చి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడం షేరు క్షీణతకు కారణమైంది. నాలుగో త్రైమాసికంలో రూ.3,790 కోట్ల నికర నష్టాన్ని చవిచూసినట్లు బ్యాంకు ప్రకటించింది. దీంతో ఉదయం బీఎస్‌ఈలో కంపెనీ షేరు 12 శాతం నష్టంతో రూ.12.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో మార్కెట్‌ రికవరీ భాగంగా ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో చివరికి నాలుగు శాతం నష్టంతో ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top