పరిమిత శ్రేణిలో ట్రేడింగ్‌

Sensex ends in red at 57,614, Nifty settles at 16,952 points - Sakshi

ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ముందు అప్రమత్తత 

స్వల్పంగా నష్టపోయిన సూచీలు

ముంబై: ట్రేడింగ్‌లో లాభ, నష్టాల మధ్య పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్‌ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్చి నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ(నేడు)కి ముందురోజు ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ ట్రేడింగ్‌ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఉదయం సెన్సెక్స్‌ 98 పాయింట్ల లాభంతో 57,752 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 455 పాయింట్ల పరిధిలో 57,495 వద్ద కనిష్టాన్ని, 57,949 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది.  చివరికి 40 పాయింట్ల నష్టంతో 57,614 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 17,032 వద్ద మొదలైంది.

ఇంట్రాడేలో 16,914 –17,062 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 34 పాయింట్లు పతనమై 16,952 వద్ద ముగిసింది. ప్రైవేట్‌ రంగ బ్యాంక్స్‌ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్ల భారీ నష్టాలను చవిచూశాయి. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 0.79%, 0.42 శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1531 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల షేర్లను విక్రయించారు. కాగా, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 15 పైసలు బలపడి 82.16 స్థాయి వద్ద స్థిరపడింది.
వేదాంతా డివిడెండ్‌ రూ. 20.5
వేదాంతా లిమిటెడ్‌ వాటాదారులకు ఐదో మధ్యంతర డివిడెండు ప్రకటించింది. రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 20.5 చొప్పున చెల్లించనుంది. ఇందుకు ఏప్రిల్‌ 7 రికార్డ్‌ డేట్‌కాగా.. మొత్తం రూ. 7,621 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top