ఇవి ‘బాహుబలి’ విత్తనాలు.. శివగామి, కట్టప్పవీ ఉన్నాయ్‌

Seed Names Are Called By Names Of Characters In Movies - Sakshi

విత్తనాలకు సినిమాల్లోని పాత్రల పేర్లు 

రైతులకు దగ్గరయ్యే ప్రయత్నాలు 

న్యూఢిల్లీ: రైతుల కష్టార్జితం వారికి కడుపు నింపుతుందా? అన్నది ప్రకృతి చేతుల్లోనే ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు, ప్రకృతి అనుకూలత, ఆరోగ్యకరమైన దిగుబడి, మార్కెట్లో మద్దతు ధరలు ఇవన్నీ కలిస్తేనే అన్నదాత కష్టానికి ఫలితం దక్కినట్టుగా భావించాలి. మహారాష్ట్రలో వరి, ఉల్లి రైతులు ఈ సీజన్‌లో బాహుబలి, కట్టప్ప, శివగామి, భీమ, దుర్గ బ్రాండ్ల విత్తనాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అకాల వర్షాలు, లాక్‌డౌన్‌లు, పెరిగిన ఖర్చుల మధ్య వారు ప్రజాదరణ పొందిన పౌరాణిక పాత్రల పేర్లతో విక్రయిస్తున్న విత్తనాలపై ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు. మహారాష్ట్రలో సాగు ఊపందుకోవడంతో ఇటువంటి బ్రాండ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి.  

పేర్లతో అనుబంధం వేరు.. 
పేర్లలో ఏముందిలే అనుకోవద్దు. కొనుగోళ్ల విషయంలో బ్రాండ్ల పేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని.. ముఖ్యంగా కరువు, సంక్షోభ సమయాల్లో వీటికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కువని మహారాష్ట్ర విత్తన పరిశ్రమ సమాఖ్య ఈడీ ఎస్‌బీ వాంఖడే పేర్కొన్నారు. ‘‘నిర్ణీత పరీక్షలు, అనుమతుల తర్వాతే విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. సినిమాల్లోని పాత్రల పేర్లు, దేవతల పేర్లను పెట్టడం ద్వారా రైతుల దృష్టిని ఆకర్షించడానికి వీలుంటుంది’’అని వాంఖడే వివరించారు.

సినిమాల్లో ప్రజాదరణ పొందిన పాత్రల పేర్లు అయితే ప్రజలకు పరిచయం చేయక్కర్లేదని.. దీంతో ప్రచారం కోసం పెద్దగా ఖర్చు చేయకుండానే ఆయా పేర్లతో తేలిగ్గా చేరువ కావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇందులోని బాహుబలి, కట్టప్ప, శివగామి పాత్రలు ఎంతో విజయవంతం అయ్యాయి. అందుకే ఈ పేర్లను విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులకు తగిలించేశాయి. వీటితోపాటు భీష్మ, అర్జున్, కరణ్‌ వంటి పౌరాణిక పేర్లతో ఉన్న విత్తనాలను అక్కడి రైతులు నాణ్యమైనవిగా భావిస్తుండడం గమనార్హం. వరికి సంబంధించి సోనా, నవాబ్, ఉల్లికి సంబంధించి కోహినూర్‌ బ్రాండ్లకూ అక్కడ మంచి ఆదరణే ఉంది. 

మ్యాజిక్‌.. 
పత్తి సాగు రైతులకు పెద్దగా మిగిల్చిందేమీ లేకపోయినా.. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో మ్యాజిక్, మనీ మేకర్, ఫోర్స్‌ పేర్లతో ఉన్న పత్తి విత్తనాలు బాగా అమ్ముడుపోతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్కెటింగ్‌ చేసుకునే విషయంలో ఈ పేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్టు కమ్యూనికేషన్‌ నిపుణుడు ఫ్రొఫెసర్‌ ఆర్‌ఎల్‌ పండిట్‌ పేర్కొన్నారు. ప్రజలకు చేరువ కావడమే ఈ పేర్ల వెనుక వ్యూహమని చెప్పారు. ‘‘తమ అనుభవం, నేపథ్యం, అవగాహన ఆధారంగా పేర్లతో వ్యక్తులకు అనుబంధం ఏర్పడుతుంది. ప్రజాదరణ పొందిన పాత్రల పేర్లు ప్రజల జ్ఞాపకాల్లో సులభంగా నిలిచిపోవడమే కాకుండా ఆయా పేర్లతో ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేసే దిశగా ప్రోత్సహిస్తుంది’’అని పండిట్‌ వివరించారు. అయితే, అనుభవం కలిగిన రైతులు మాత్రం నాణ్యమైన విత్తనాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. గత సీజన్‌లో నాణ్యతలేమి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు.. సోయాబీన్, ఉల్లి, పత్తి విత్తనాలపై ఫిర్యాదులు కూడా చేశారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top