మరో కొద్ది రోజుల్లోనే మరో ఏడాది కాల గర్భంలో కలిసి పోనుంది. కొత్త ఏడాది కోసం ఎన్నో కొత్త ఆశలతో ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏటా ఏదో ఒకటి సాధించాలని గట్టిగా సంకల్పంతో నిర్ణయించుకుంటారు. అలా సినిమా ఇండస్ట్రీలోనూ ఈ ఏడాది మన సినిమాలు సూపర్ హిట్ కావాలని కోరుకోవడం సహజం. ముఖ్యంగా ఈ ఏడాదిలోనైనా విజయాలు దక్కాలని టాలీవుడ్‌లో దర్శక, నిర్మాతలు కోరుకుంటారు. అనుకున్నవన్నీ జరగకపోయినా.. మనకంటూ ఒక రోజు ఉంటుందని ముందడుగు వేస్తూనే ఉంటాం.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఈ ఏడాది మన టాలీవుడ్‌కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఒక్క సంక్రాంతికి వస్తున్నాం, ఓజీ చిత్రాలు మినహాయిస్తే ఏ ఒక్కటి కూడా రూ.500 కోట్ల దరిదాపుల్లోకి కూడా రాలేదు. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో రూ.500 కోట్లు అనేది కష్టసాధ్యమైన పనేమి కాదు. గత పదేళ్లలో ప్రతి ఏటా ఏదో ఒక బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్న టాలీవుడ్.. ఈసారి ఎందుకో వెనకంజలో ఉంది. గతేడాది పుష్ప-2 ప్రభంజనంతో రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దంగల్ తర్వాత ఆల్‌టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
బాహుబలి-2 ప్రభంజనం..
గత పదేళ్లుగా పరిశీలిస్తే టాలీవుడ్ పెద్ద సినిమాలు చాలానే వచ్చాయి. 2016లో వచ్చిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్ మూవీగా అవతరించింది. ఆ తర్వాత 2017లో వచ్చిన బాహుబలి-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత 2018లో విడుదలైన రామ్ చరణ్ రంగస్థలం ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
బాహుబలి-2 తర్వాత వచ్చిన ప్రభాస్ మూవీ సాహో. ఈ చిత్రం 2019లో రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్ సత్తా చాటింది. ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత 2020లో వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇదే.
ఆ తర్వాత ఏడాది 2021లో రిలీజైన బన్నీ- సుకుమార్ మూవీ పుష్ప ది రైజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.390 కోట్ల వసూళ్లతో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. 2022లో దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఇక 2023లో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.701 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
పుష్ప-2 రికార్డ్..
గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా అవతరించింది. ఇక 2025లో వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ.303 కోట్లతో టాలీవుడ్ నుంచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆల్ ఇండియా వైడ్ చూస్తే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్-1 మొదటి ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ దురంధర్ ఈ రికార్డ్ బ్రేక్ అవకాశమున్నట్లు తెలుస్తోంది.


