రెండు ఇష్యూలకు సెబీ చెక్‌

Sebi returns draft papers of BVG India, Fincare Small Finance - Sakshi

ఆర్‌అండ్‌బీ ఇన్‌ఫ్రాకు ఓకే

ఎయిరాక్స్‌ టెక్‌ వెనకడుగు

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే బాటలో రెండు కంపెనీలు దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌లకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చెక్‌ పెట్టింది. ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలు బీవీజీ ఇండియా లిమిటెడ్, ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఇండియా దరఖాస్తులను సెబీ తిప్పి పంపింది. కాగా.. మౌలిక సదుపాయాల రంగ కంపెనీ ఆర్‌అండ్‌బీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌కు సెబీ ఈ నెల 3న గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

వెరసి కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ చేపట్టేందుకు దారి ఏర్పడింది. సమీకృత సర్వీసుల కంపెనీ బీవీజీ ఇండియా 2021 సెప్టెంబర్‌లో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, పీఈ ఇన్వెస్టర్‌ సంస్థ 3ఐ గ్రూప్‌.. మరో 71.96 లక్షలకుపైగా షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. అయితే సెబీ ప్రాస్పెక్టస్‌కు చెక్‌ పెట్టింది.  

రూ. 1,330 కోట్ల కోసం
ఐపీవో ద్వారా రూ. 1,330 కోట్ల సమీకరణకు ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 2021 మే నెలలో సెబీకి ప్రాస్పెక్టస్‌ దఖలు పరచింది. జులైలో సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ ఇష్యూ చేపట్టలేదు. సెబీ అనుమతి పొందిన తదుపరి ఏడాదిలోగా నిధుల సమీకరణను పూర్తి చేయవలసి ఉన్న సంగతి తెలిసిందే. ఐపీవో చేపట్టేందుకు లభించిన గడువు 2022 జులైలో ముగియడంతో ఆగస్ట్‌లో తిరిగి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు మరో 1.7 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. అయితే ఈ నెల తొలి వారంలో బీవీజీ ఇండియా, ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ ప్రాస్పెక్టస్‌లను సెబీ తిప్పి పంపింది.  

ఎయిరాక్స్‌ నేలచూపు
మెడికల్‌ పరికరాల తయారీ కంపెనీ ఎయిరాక్స్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రయత్నాలను విరమించుకుంది. ఐపీవో ద్వారా రూ. 750 కోట్ల సమీకరణ కోసం 2022 సెప్టెంబర్‌లో సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. ప్రాస్పెక్టస్‌ ప్రకారం కంపెనీ ప్రమోటర్లు సంజయ్‌ భరత్‌ కుమార్‌ జైస్వాల్, ఆషిమా సంజయ్‌ జైస్వాల్‌ షేర్లను విక్రయించేందుకు సిద్ధపడ్డారు. పీఎక్స్‌ఏ ఆక్సిజన్‌ జనరేటర్‌ తయారీలో ఉన్న కంపెనీ గత నెలలో ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top