
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో వ్యాపించే వదంతులపై తప్పనిసరిగా స్పందించాల్సిన గడువును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పొడిగించింది. దీంతో టాప్–100 లిస్టెడ్ కంపెనీలకు వెసులుబాటు లభించింది. వెరసి మార్కెట్లో పుట్టే రూమర్లను ధ్రువ పరచడం, ఖండించడం లేదా స్పష్టతనివ్వడం వంటి చర్యలను తప్పనిసరిగా చేపట్టాలనే నిబంధన అమలుకు మరింత గడువు లభించింది.
సెబీ ప్రతిపాదిత ఈ నిబంధనలు తొలుత టాప్ ర్యాంక్‌లోని 100 లిస్టెడ్ కంపెనీలకు అమలుకానున్న సంగతి తెలిసిందే. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)రీత్యా అగ్రభాగంలో నిలిచే 100 కంపెనీలు 2024 ఫిబ్రవరి 1 నుంచి రూమర్లపై తప్పనిసరిగా స్పందించాలంటూ సెబీ ఇంతక్రితం గడువు విధించింది. తాజాగా ఈ డెడ్‌లైన్‌ను జూన్ 1వరకూ పొడిగిస్తూ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.
ఈ బాటలో మార్కెట్ విలువలో టాప్–250 ర్యాంకు లిస్టెడ్ కంపెనీలకు రూమర్లపై స్పందించాల్సిన నిబంధనలు 2024 డిసెంబర్ 1 నుంచి అమలుకానున్నాయి. నిజానికి 2024 ఆగస్ట్ 1 నుంచి నిబంధనలు అమలు చేయవలసిందిగా టాప్–250 సంస్థలను సెబీ గతంలో ఆదేశించింది. లిస్టెడ్ కంపెనీలు కార్పొరేట్ పాలనను మరింత పటిష్టంగా అమలు చేసే లక్ష్యంతో సెబీ తాజా నిబంధనలకు తెరతీసిన విషయం విదితమే.