పెరుగుతున్న చమురు ధరలతో, తినడం మానేస్తున్నారు

Sbi Expects Crude Oil Prices Increase Reduced Non Discretionary Items - Sakshi

ముంబై: పెరిగిపోతున్న ముడి చమురు ధరల భారం ప్రజల ఆలోచనా ధోరణిని మార్చేస్తోంది. విచక్షణారహిత వినియోగం కిందకు రాని, నిత్యావసరాలైన కిరాణ (గ్రోసరీ), జంక్‌ ఫుండ్‌ సంబంధ ఆహారం, యుటిలిటీ (విద్యుత్తు, టెలికం) తదితర ఖర్చులను తగ్గించుకుంటున్నారని ఎస్‌బీఐ ఆర్థిక వేత్తలు ఓ నివేదిక రూపంలో వెల్లడించారు. చమురు ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పన్నులను తగ్గించాలని సూచించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ రూ.100కు పైనే పలుకుతుండగా.. డీజిల్‌ సైతం రూ.100కు చేరువలో ఉంది. విక్రయ ధరలో రూ.40కు పైనే పన్నుల రూపంలో కేంద్రం, రాష్ట్రాలకు వెళుతోంది. వాస్తవానికి గతేడాది కరోనా వైరస్‌ భయంతో చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి. ఆ సమయంలో అదనపు ఆదాయం కోసం కేంద్ర సర్కారు ఎక్సైజ్‌ సుంకాలను పెంచుకుంది. తిరిగి చమురు ధరలు గరిష్టాలకు చేరినా కానీ, ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఇది వినియోగదారులపై ధరల భారాన్ని మోపుతోంది.

వెంటనే పన్నులు తగ్గించాలి..  
‘‘వినియోగదారులు ఇంధనంపై ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. ఎస్‌బీఐ కార్డులపై ఖర్చులను విశ్లేషించగా.. పెరిగిన చమురు భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకు జంక్‌ఫుడ్‌పై ఖర్చులను వారు గణనీయంగా తగ్గించుకున్నారు. అంతేకాదు గ్రోసరీ, యుటిలిటీ కోసం చేసే ఖర్చు కూడా తగ్గిపోయింది’’ అని ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ తెలిపారు. చమురుపై అధిక వ్యయాలు ద్రవ్యోల్బణంపైనా ప్రభావం చూపిస్తాయని హెచ్చరించారు. చమురు ధరలు 10 శాతం పెరిగితే ద్రవ్యోల్బణంపై అర శాతం ప్రభావం పడుతుందన్నారు. కనుక వెంటనే పన్నులను తగ్గించి క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం స్వల్పం గా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నా, ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ఉందని.. దీనికితోడు ఆర్థిక పొదుపులు తగ్గడం సవాలేననని ఈ నివేదిక తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top