మీకు ‘క్రిటికల్‌’ కవచం ఉందా?

Sakshi Special Story About Critical Illness Policy

ఊహించని అనారోగ్యం వచ్చి పడితే?

మీ బడ్జెట్‌ సరిపోకపోవచ్చు

బేసిక్‌ హెల్త్‌ ప్లాన్‌లలో ఆస్పత్రి వ్యయాలకే కవరేజీ

తీవ్ర వ్యాధుల్లో ఖర్చు బారెడు

అన్నింటికీ రక్షణ ఏర్పాట్లు ఉండాల్సిందే

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ ప్రతీ ఒక్కరికీ అవసరం

ఉదయ్‌ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు. వయసు 46ఏళ్లు. అప్పటి వరకు ఎటువంటి అనారోగ్యాల్లేవు. ఓ రోజు తెల్లవారుజామున బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో వెంటనే సమీపంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలు నిలిచాయి. కానీ, బిల్లు రూ.11 లక్షలు అయ్యింది. కానీ, ఉదయ్‌కు రూ.5లక్షల వరకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ఉంది. అందులోనూ రూ.40 వేల వరకు కవరేజీ రాలేదు.

దీంతో రూ.6.40 లక్షలను తన జేబు నుంచి చెల్లించుకోవాల్సి వచ్చింది. మారుతున్న వైద్య ఖర్చులకు తగ్గ రక్షణ లేకపోతే పడే ఆర్థిక భారం ఎలా ఉంటుందన్నది ఈ ఉదాహరణ చూసి తెలుసుకోవచ్చు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, పని ఒత్తిళ్లు ఇవన్నీ కలసి ఎప్పుడు ఏ అనారోగ్యం బారిన పడతామో ఊహించలేకుండా ఉంది. అందుకే తమవంతుగా రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైన ఉంది. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్‌ ప్లస్‌ కథనం..

కేన్సర్, మూత్రపిండాల వ్యాధులు, కాలేయం లేదా గుండె సంబంధిత తీవ్ర వ్యాధుల బారిన పడితే ఆ బాధ ఒక్కరికే పరిమితం కాదు. ఆ కుటుంబం మొత్తంపైనా ప్రభావం ఉంటుంది. ఆర్థికంగానే కాదు, శారీరకంగా, మానసికంగా నలిగిపోవాల్సి వస్తుంది. మంచి చికిత్స కోసం ఆస్పత్రిని ఎంపిక చేసుకోవడంతోపాటు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడం శక్తికి మించిన పనిగా అనిపిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడితే అప్పటి వరకూ ప్రతీ నెలా వచ్చిన ఆదాయానికి కూడా బ్రేక్‌ పడొచ్చు.

శాశ్వత ఉద్యోగ నష్టం ఏర్పడితే ఆర్థికంగా ఆ కుటుంబం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ప్రతీ ఒక్కరికీ ముందు జాగ్రత్త, రక్షణ చర్యలు అవసరం. తీవ్ర అనారోగ్య సమస్యలన్నవి (క్రిటికల్‌ ఇల్‌నెస్‌) ఏ స్థాయిలో ఉంటాయో ఊహించలేము. ఉదాహరణకు కేన్సర్‌ మూడోదశలో ఉన్నవారికి దీర్ఘకాలం జీవించి ఉండే అవకాశాలు తక్కువ. కేన్సర్‌ రెండో దశలోనే బయటపడితే ఖర్చు ఎక్కువే పెట్టుకోవాల్సి వస్తుంది. గుండెపోటు తీవ్ర స్థాయిలో వస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మూ త్ర పిండాల సమస్యలు వెలుగు చూస్తే దీర్ఘకాలం పాటు కొనసాగొచ్చు. గుండెజబ్బులు కూడా దీర్ఘకాలం పాటు కొనసాగేవే అధికం. అందుకే వీటి విషయంలో సన్నద్ధత అవసరమని నిపుణులు సూ చిస్తుంటారు. కొన్ని వ్యాధుల్లో దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరం ఏర్పడతాయి. గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం తదితర క్లిష్టమైన అనారోగ్యాలను మన దేశంలో ఎక్కువగా చూస్తున్నాం. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నివేదిక ప్రకారం.. దేశంలో కేన్సర్‌ కేసులు 2025 నాటికి 15.7 లక్షలకు (వార్షిక రేటు) పెరుగుతాయని అంచ నా. ప్రస్తుత 13.9 లక్షలతో పోలిస్తే 12% పెరగనున్నాయి. దేశంలో ప్రతీ నాలుగు మరణాల్లో ఒక టి గుండె జబ్బుల కారణంగానే నమోదవుతోంది. మనదేశంలో 2018 నాటికి 1.29 కోట్ల జనాభా తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్టు అంచనా.  

ఆర్థిక భారం ఎంతో..
తీవ్ర అనారోగ్య సమస్యల్లో చికిత్సా వ్యయాలు కూడా అధికంగానే ఉంటుంటాయి. ఎందుకంటే ఈ తరహా వ్యాధుల్లో దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరంపడతాయి. ‘‘కేన్సర్‌ అయితే ఒక్క విడత శస్త్రచికిత్స లేదా కీమోథెరపీతో సరిపోదు. దీర్ఘకాలం పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది’’ అని మ్యాక్స్‌బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అండర్‌రైటింట్‌ డైరెక్టర్‌ బబతోష్‌ మిశ్రా తెలిపారు. కేన్సర్‌ చికిత్సల కోసం రూ.15–20 లక్షలు ఖర్చు అవుతుందని.. అత్యాధునిక చికిత్సలు తీసుకునేట్టు అయితే ఈ వ్యయం రూ.కోటి వరకు కూడా పెరిగిపోవచ్చని చెప్పారు.

‘‘గుండె జబ్బులకు చికిత్స కోసం మెట్రో ల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.1.5–15 లక్షల వరకు ఖర్చవుతుంది. స్టెంట్, బైపాస్‌ సర్జరీ లేదా వాల్వ్‌ మార్చడంపై ఈ వ్యయం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది’’అని ఎడెల్‌వీజ్‌ టోకియో లైఫ్‌ ముఖ్య పంపిణీ అధికారి అనూప్‌శేత్‌ పేర్కొన్నారు. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 15 శాతానికి పైగా ఉంటోంది. అంటే చికిత్సల వ్యయాలు ఏటేటా ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. టైర్‌–2, టైర్‌ 3 పట్టణాలతో పోలిస్తే టైర్‌–1 పట్టణాల్లో చికిత్సల వ్యయాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. కనుక 35 ఏళ్లు దాటిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యల చరిత్ర ఉన్న కుటుంబాల్లోని వారికి తప్పకుండా ముందస్తు ప్రణాళిక అవసరం.  

ప్రణాళిక ప్రకారం..
ఆరోగ్యం విషయంలో ఊహించని ఖర్చులను తట్టుకునేందుకు ప్రతీ ఒక్కరికీ ప్రణాళిక అవసరం. ‘‘తీవ్ర అనారోగ్యాల విషయమై ముందు జాగ్రత్త పడే వారు 3 రకాల వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది హాస్పిటలైజేషన్‌. ఆస్పత్రి లో చేరాల్సి వస్తే ఎదురయ్యే ఖర్చులను బేసిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ సాయంతో గట్టెక్కవచ్చు. కొన్ని వ్యాధులకు దీర్ఘకాలం పాటు ఔషధాలు, పరీక్షలు అవసరంపడతాయి.

కానీ, ఇండెమ్నిటీ ప్లాన్‌లు అన్నవి ఒక్కసారి ఒక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి క్లెయిమ్‌ చేశాక.. అదే ఏడాది మళ్లీ అదే అనారోగ్యానికి సంబంధించి పరిహారం అం దించవు. కనుక క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ అవసరం. మూడోది ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేసుకునేలా ఉండాలి’’ అని ముంబైకి చెందిన ఫైనాన్షియల్‌ ప్లానర్‌ పంకజ్‌ మాల్డే సూచన. అందుకే భిన్న రకాల బీమా ప్లాన్లకుతోడు అత్యవసర నిధి కూడా అవసరం అని గుర్తించాలి.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌..
సాధారణ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ప్లాన్‌లనే ఇండెమ్నిటీ ప్లాన్‌లు అని కూడా అంటారు. ఇవి ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలకు పరిహారం చెల్లిస్తాయి. జీవితంలో ఏ దశలో ఉన్నారు, ఏ పట్టణంలో నివసిస్తున్నారు, అక్కడ చికిత్సల వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ ఆరోగ్య చరిత్ర  అంశాల ఆధారంగా బేసిక్‌ ఇండెమ్నిటీ కవరేజీని నిర్ణయించుకోవాలి. ఢిల్లీ, ముంబై వంటి టైర్‌–1 పట్టణాల్లో అయితే రూ.20–25 లక్షల కవరేజీతో ప్లాన్‌ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘ఈ కవరేజీ కూడా నూరు శాతం రక్షణనివ్వదు. ఎందుకంటే కొన్ని చికిత్సల ఖర్చులు భారీగా ఉన్నాయి.

ఉదాహరణకు లివర్‌ మార్పిడి చికిత్సకు రూ.40–50లక్షలు అవుతుంది’’ అని ఫైనాన్షియల్‌ ప్లానర్‌ పంకజ్‌మాల్డే వివరించారు. టైర్‌–2, 3 పట్టణాల్లో ఉంటే కనీసం రూ.10 లక్షలు, అదే చిన్న పట్టణాల్లోని వారు కనీసం రూ.5లక్షల బేసిక్‌ ఇండెమ్నిటీ ప్లాన్‌ తీసుకోవడం అవసరం. అధిక కవరేజీతో ప్లాన్‌ తీసుకోవాలంటే అందుకు ప్రీమియం కూడా ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు తక్కువ మొత్తంతో బేసిక్‌ ప్లాన్‌ తీసుకుని, అధిక కవరేజీనిచ్చే టాపప్‌ ప్లాన్‌ జోడించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షల ప్లాన్‌ తీసుకుని, రూ. 15 లక్షల టాపప్‌ జోడించ వచ్చు. లేకుండా వస్తుంటాయి. కొన్ని కంపెనీలు స్వల్ప ప్రీమియం ను కూడా వసూ లు చేస్తున్నాయి.

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ
ఇండెమ్నిటీ ప్లాన్‌కు పూర్తి భిన్నమైనది. బీమా ప్లాన్‌ జాబితాలోని తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే అప్పుడు ఏకమొత్తంలో పరిహారాన్ని చెల్లించేదే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌. బేసిక్‌ హెల్త్‌ ప్లాన్‌లో కవర్‌ కాని ఖర్చులను ఈ ప్లాన్‌ ఆదుకుంటుంది. ఉద్యోగం ఆగిపోవడం లేదా కోల్పోవడం వల్ల ఆదాయ నష్టాన్ని ఈ రూపంలో కాస్తంత అయినా భర్తీ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి తన వార్షిక స్థూల ఆదాయానికి 5–10 రెట్ల వరకు కవరేజీతో క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ తీసుకోవడం సూచనీయం. అయితే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌లో ఒక నిబంధన విషయమై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ వెలుగు చూసిన తర్వాత సదరు రోగి కనీసం ఇన్ని రోజుల పాటు జీవించి ఉంటేనే పరిహారం చెల్లిస్తామనే నిబంధన ఉంటుంది. సాధారణంగా 30 రోజుల కాలాన్ని బీమా సంస్థలు అమలు చేస్తున్నాయి.

ఉదాహరణకు స్ట్రోక్‌ వచ్చి చనిపోతే పరిహారం రాదు. స్ట్రోక్‌ వచ్చి 30 రోజులు ప్రాణాలతో ఉంటేనే ఈ ప్లాన్‌లో పరిహారం లభిస్తుంది. వాస్తవానికి తీవ్ర అనారోగ్యంతో జీవించి ఉన్న వారికే భారీగా ఖర్చు ఎదురవుతుందన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 30 క్రిటికల్‌ ఇల్‌నెస్‌ల వరకూ కవరేజీనిచ్చే ప్లాన్‌లు మార్కెట్లో ఉన్నాయి. కేన్సర్‌ లేదా గుండె జబ్బుల వంటి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నవారు ఆయా వ్యాధులకు కవరేజీనిచ్చే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌లను ఎంచుకోవాలి. ప్రతీ క్రిటికల్‌ ఇల్‌నెస్‌లోనూ విడిగా ఏఏ సమస్యలకు కవరేజీ ఉంటుందన్న వివరాలు పాలసీ వర్డింగ్స్‌ డాక్యుమెంట్‌లో వివరంగా ఉంటుంది. ఎక్కువ రిస్క్‌లు ఉండే గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్, కోమా, మూత్రపిండాల వైఫల్యం తదితర వాటికి కవరేజీ తప్పకుండా ఉండేలా ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది.  

పరిశీలన తర్వాతే..: నియమ, నిబంధనలను కచ్చితంగా చదివిన తర్వాతే క్రిటికల్‌ఇల్‌నెస్‌ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) మార్గదర్శకాలను చూస్తే.. కొన్ని రకాల తీవ్ర అనారోగ్య సమస్యలకే పూర్తి కవరేజీ లభిస్తుంది. కొన్నింటి విషయంలో చివరి దశలోనే పరిహారానికి అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు, లివర్‌ సమస్యల్లో అయితే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ అన్నది కేవలం పనిచేయని, పూర్వపు స్థితికి తీసుకురాలేట్టయితేనే కవరేజీ లభిస్తుంది. అదే కేన్సర్, స్ట్రోక్, గుండెపోటు అయితే ఏ దశలో ఉన్నప్పటికీ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్లలో కవరేజీ లభిస్తుంది. లైఫ్‌ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లకు రైడర్‌ రూపంలో వచ్చే క్రిటికల్‌ ఇన్‌లెస్‌ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. వీటికంటే కూడా విడిగా ప్లాన్‌ను తీసుకోవడం వల్ల సమగ్రమైన కవరేజీతో వస్తాయి. వీటిల్లో పరిమితులు కూడా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు కేన్సర్‌ మూడో దశలోనే పరిహారం చెల్లిస్తామన్న నిబంధన ఉంటే, స్టేజ్‌–2 బయటపడినప్పటికీ పరిహారం రాదు. అందుకే వైద్యం కోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ‘‘కనీసం రూ.3–5 లక్ష లు అయినా ఉండాలి. మెట్రోల్లో ఉండే వారికి రూ.8–10 లక్షలు అత్యవసర నిధిగా ఉంచుకోవడం అవసరం’’ అని మాల్డే సూచించారు.

తీవ్ర వ్యాధులకు చికిత్సా వ్యయాలు
కేన్సర్‌
► శస్త్రచికిత్సకు రూ.3–6 లక్షలు
► కీమోథెరపీ ఒక్కో సెషన్‌కు రూ.50,000–2లక్షలు. సుమారు రూ.5–10 లక్షల వరకు ఖర్చు
► రేడియోథెరపీ రూ.2–20లక్షలు

గుండె జబ్బులు
► యాంజియోగ్రఫీ రూ.20,000
► యాంజియోప్లాస్టీ రూ.2.5–6.5లక్షలు
► వాల్వ్‌ సర్జరీ రూ.2.5–6లక్షలు
► బైపాస్‌ సర్జరీ రూ.2–5లక్షలు

మూత్రపిండాల వైఫల్యం
► డయాలసిస్‌ రూ.2,000–5,000 ప్రతీ సెషన్‌కు (వారానికి మూడు పర్యాయాలు)
► మూత్రపిండాల మార్పిడి రూ.5–10లక్షలు
► బ్రెయిన్‌స్ట్రోక్‌ రూ.5–10 లక్షలు

నోట్‌: ప్రాంతాలను బట్టి ఈ వ్యయాల్లో మార్పులు ఉంటుంటాయి.

హెల్త్‌ ప్లాన్‌ ప్రీమియం
ప్లాన్‌    కవరేజీ    ప్రీమియం
    (రూ.లలో)    (రూ.లలో)
బేసిక్‌ ఇండెమ్నిటీ ప్లాన్‌    10 లక్షలు    8,265
క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌    30 లక్షలు    4,551

నోట్‌: 30 ఏళ్ల ఢిల్లీ నివాసికి సంబంధించిన అంచనాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top