లండన్ అధ్యయనం హెచ్చరిక!
మానవాళి సాంకేతిక ప్రగతికి సూచికలుగా భావిస్తున్న ఉపగ్రహాలు, రాకెట్ ప్రయోగాలు.. ఇప్పుడు భూమి చుట్టూ ఉన్న పర్యావరణానికి కొత్త శాపంగా మారుతున్నాయి. నిరంతరాయంగా సాగుతున్న అంతరిక్ష ప్రయోగాలు ఎగువ వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయని, దీనివల్ల భూమికి చేరే సూర్యరశ్మి పరిమాణం క్రమంగా తగ్గుతోందని బ్రిటన్‌కు చెందిన ‘యూనివర్సిటీ కాలేజ్ లండన్’(యూసీఎల్) పరిశోధకుల అధ్యయనంలో విల్లడైంది.
ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్ ‘ఎర్త్ ఫ్యూచర్’లో మే 14న ప్రచురితమైన ‘రేడియేటివ్ ఫోర్సింగ్ అండ్ ఓజోన్ డిప్లిషన్ ఆఫ్ ఎ డికేడ్ ఆఫ్ శాటిలైట్ మెగాకాన్స్టెలేషన్ మిషన్స్’ అనే పరిశోధనా పత్రం ఈ ఆందోళనకర అంశాలను తెరపైకి తెచ్చింది.
నియంత్రణ లేని జియో ఇంజినీరింగ్ ప్రయోగం!
యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కానర్ ఆర్.బార్కర్, ప్రొఫెసర్ ఎలోయిస్ ఎ.మరైస్, ఎరిక్ వై నేతృత్వంలోని బృందం 2020 నుంచి 2022 మధ్య కాలంలో జరిగిన రాకెట్ ప్రయోగాలు, అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాల అవశేషాలపై సమగ్ర పరిశోధన చేసింది. ‘రాకెట్ ప్రయోగాలు వాతావరణ కాలుష్యానికి ఒక ప్రత్యేకమైన మూలంగా మారాయి. ఇవి హానికరమైన రసాయనాలను నేరుగా ఎగువ వాతావరణ పొరల్లోకి విడుదల చేస్తున్నాయి. తద్వారా భూమిపై ఇప్పటివరకు అత్యంత స్వచ్ఛంగా భావించిన సహజ వాతావరణం కలుషితమవుతోంది’ అని యూసీఎల్ ప్రధాన పరిశోధకుడు కానర్ బార్కర్ తెలిపారు.
గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడానికి శాస్త్రవేత్తలు ప్రతిపాదించే కృత్రిమ ‘జియో ఇంజినీరింగ్’ పద్ధతుల తరహాలోనే.. ఈ ఉపగ్రహ ప్రయోగాల వల్ల విడుదలవుతున్న కాలుష్యం భూమిని తాకే సూర్యరశ్మిని అడ్డుకుంటోందని పరిశోధకులు తేల్చారు. ఇది భూమిపై స్వల్ప శీతలీకరణ ప్రభావాన్ని చూపినప్పటికీ పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఇది చాలా తక్కువని, అయితే దీనివల్ల భవిష్యత్తులో ఊహించని తీవ్ర పర్యావరణ పరిణామాలు ఎదురవుతాయని ప్రాజెక్ట్ లీడ్ ప్రొఫెసర్ ఎలోయిస్ మరైస్ హెచ్చరించారు. పరిస్థితి చేతులు దాటిపోకముందే దేశాధినేతలు చర్యలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
ఐదేళ్లలోనే మూడింతలైన ప్రయోగాలు
రాకెట్ ప్రయోగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఈ నివేదిక గణాంకాలతో సహా విశ్లేషించింది.
| సంవత్సరం | వార్షిక రాకెట్ ప్రయోగాల సంఖ్య |
|---|---|
| 2020 | 114 |
| 2025 | 329 |
ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నిర్వహిస్తున్న స్టార్‌లింక్ మెగాకాన్స్టెలేషన్ ప్రాజెక్టేనని నివేదిక స్పష్టం చేసింది. ఇంటర్నెట్ సేవల కోసం స్పేస్ ఎక్స్ ఇప్పటివరకు కక్ష్యలోకి సుమారు 12,000 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ దశాబ్దం ముగిసేనాటికి అంతరిక్షంలోకి మరో 65,000 ఉపగ్రహాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ, ప్రస్తుత వేగాన్ని చూస్తుంటే ఆ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉండేలా కనిపిస్తోంది.
ఎగువ వాతావరణంలో తిష్ఠ వేస్తున్న మసి
స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 వంటి రాకెట్లు కిరోసిన్ ఆధారిత ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. ఇవి మండటం వల్ల భారీ ఎత్తున ‘నల్ల కార్బన్’ లేదా ‘మసి’ కణాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. భూమిపై అయితే వర్షాల వల్ల ఈ మసి కడిగివేయబడుతుంది, కానీ ఎగువ వాతావరణంలో గాలి ప్రసరణ చాలా నెమ్మదిగా ఉండటం వల్ల ఈ హానికరమైన మసి కణాలు అక్కడే దశాబ్దాల పాటు తిష్ఠ వేస్తున్నాయి.
ప్రమాద ఘంటికలు
2029 నాటికి అంతరిక్ష పరిశ్రమ ద్వారా ఏటా దాదాపు 870 టన్నుల మసి వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రయోగాల వల్ల క్లోరిన్ వంటి రసాయనాలు కూడా విడుదలవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కిరోసిన్ ఇంధన రాకెట్ల వల్ల విడుదలయ్యే క్లోరిన్ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ఓజోన్ పొరపై దీని ప్రభావం స్వల్పంగానే ఉంది. కానీ, భవిష్యత్తులో ప్రయోగాలు పెరిగితే ముప్పు తప్పదు.
మున్ముందు మరింత పోటీ!
ప్రస్తుతం అంతరిక్ష రంగంలో వాణిజ్య పోటీ విపరీతంగా పెరుగుతోంది. కేవలం స్పేస్ ఎక్సే కాకుండా అమెజాన్ సైతం తన సొంత ఇంటర్నెట్ ఉపగ్రహ నెట్‌వర్క్ ‘లియో’ను అభివృద్ధి చేసే పనిలో పడింది. అటు చైనా కూడా ‘గువాంగ్’ పేరుతో భారీ ఉపగ్రహ సమూహాన్ని నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వేలాది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడానికి మరిన్ని వందల రాకెట్ ప్రయోగాలు అవసరమవుతాయి. అంతరిక్ష సాంకేతికత వైపు ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్న తరుణంలో.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేలా కఠిన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది.
ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు


