యాడ్‌వెర్బ్‌లో రిలయన్స్‌కు వాటా

RIL picks 54 in robotics firm Addverb Technologies for Rs 983 crore - Sakshi

54 శాతం వాటా కొనుగోలు 

డీల్‌ విలువ రూ. 983 కోట్లు 

నోయిడాలో రోబో తయారీ యూనిట్‌ 

ఈ ఏడాది రూ. 400 కోట్ల ఆదాయం!

న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ రిటైల్‌ దేశీ రోబోటిక్స్‌ కంపెనీ యాడ్‌వెర్బ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. రిలయన్స్‌ రిటైల్‌ 13.2 కోట్ల డాలర్ల(రూ. 983 కోట్లు)తో తమ కంపెనీలో 54 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు యాడ్‌వెర్బ్‌ సహవ్యవస్థాపకుడు, సీఈవో సంగీత్‌ కుమార్‌ తాజాగా వెల్లడించారు. తద్వారా రిలయన్స్‌ రిటైల్‌ అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించినట్లు తెలియజేశారు. అయితే తమ సంస్థ స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. రిలయన్స్‌ నుంచి లభించనున్న నిధులను విదేశాలలోనూ వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా నోయిడాలో అతిపెద్ద రోబోటిక్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే నోయిడాలో వార్షికంగా 10,000 రోబోల తయారీ సామర్థ్యంగల ప్లాంటును కలిగి ఉన్నట్లు పేర్కొంది.  

ఇప్పటికే సేవలు.. 
ఇప్పటికే రిలయన్స్‌ తమకు ప్రధాన కస్టమర్లలో ఒకటిగా ఉన్నట్లు కుమార్‌ పేర్కొన్నారు. జియోమార్ట్‌ గ్రోసరీ బిజినెస్‌ కోసం కంపెనీతో కలసి అత్యాధునిక ఆటోమేటెడ్‌ వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దీంతో రెండు సంస్థల మధ్య నమ్మకమైన సంబంధాలు నెలకొన్నట్లు తెలియజేశారు. రిలయన్స్‌ రిటైల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా 5జీ, బ్యాటరీ టెక్నాలజీ, కార్బన్‌ ఫైబర్‌ అభివృద్ధికి వీలున్నట్లు వివరించారు. దీంతో అత్యాధునిక, చౌక ధరలలో రోబోలను అందించగలమని తెలియజేశారు.  

కంపెనీ బ్యాక్‌గ్రౌండ్‌ 
2016లో ఏర్పాటైన యాడ్‌వెర్బ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 శాతం వృద్ధితో రూ. 400 కోట్ల టర్నోవర్‌ సాధించే వీలున్నట్లు కుమార్‌ తెలియజేశారు. 5–6ఏళ్లలో బిలియన్‌ డాలర్‌ కంపెనీగా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆదాయంలో 80 శాతం దేశీయంగా సమకూరుతున్నట్లు వెల్లడించారు. రానున్న 4–5 ఏళ్లలో విదేశాల నుంచి 50 శాతం టర్నోవర్‌ను సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ఆదాయంలో 15 శాతం వాటా ఆక్రమిస్తున్న సాఫ్ట్‌వేర్‌ విభాగాన్ని భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. కంపెనీకి సింగపూర్, నెదర్లాండ్స్, యూఎస్, ఆస్ట్రేలియాలలో నాలుగు అనుబంధ సంస్థలున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top