వెండి ధరలు రోజుకో రికార్డ్ కొడుతూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్ సిల్వర్ 100 డాలర్ల మార్క్‌ను దాటేసింది. వెండి ధరలపై నిరంతరం పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంతకు ముందే వెండి ధర 100 డాలర్లకు చేరువ కాగానే ఆనందంతో పోస్టు పెట్టారు.
‘వెండి 100 డాలర్లు (ఔన్స్‌కు) దాటుతోంది.. యేయ్’ అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, ఫియాట్ కరెన్సీలపై నమ్మకం తగ్గడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి హార్డ్ అసెట్లకు కియోసాకి ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నారు.
ఒకవైపు విలువైన లోహంగా, మరోవైపు పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే లోహం కావడం వల్ల వెండికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో వినియోగం వెండి భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. అయితే, విశ్లేషకులు వెండి ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయని, ఇది అత్యంత అస్థిరమైన లోహాల్లో ఒకటని హెచ్చరిస్తున్నారు.
అయితే ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్‌కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని తన ఇంతకు ముందు పోస్ట్‌లో కియోసాకి తెలిపారు.
SILVER to BREAK $100.
Yay!!!!— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026


