పశ్చిమాసియా యుద్ధం మరింత కాలం కొనసాగితే?  | Relief Packages Likely For Vulnerable Sectors If West Asia Crisis | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా యుద్ధం మరింత కాలం కొనసాగితే? 

Mar 31 2026 4:58 AM | Updated on Mar 31 2026 4:58 AM

Relief Packages Likely For Vulnerable Sectors If West Asia Crisis

పరిష్కారాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి 

ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ పన్ను ఉపశమనం 

రోడ్‌టెప్‌ పథకం కింద ప్రయోజనాల పునరుద్ధరణ

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితులు ఇలాగే కొనసాగితే (ఇరాన్‌–ఇజ్రాయెల్‌/అమెరికా), దీని కారణంగా దేశీ పరిశ్రమలపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు, ఉపశమన ప్యాకేజీలను ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో, దేశీయంగా వినియోగదారులపై ఈ ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.3 ఎక్సైజ్‌ సుంకం తగ్గించగా, డీజిల్‌పై  ఎక్సైజ్‌ సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. 

అదేవిధంగా దేశీయ సరఫరా పెంచేందుకు డీజిల్, ఏటీఎఫ్‌ ఎగుమతులపై మళ్లీ సుంకాలు విధించడం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులు ఫిబ్రవరి 28న ప్రారంభమైన తరువాత, ఇరాన్‌ ప్రతీకార చర్యలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సుమారు 50 శాతం వరకు పెరిగాయి. ఈ నెల ప్రారంభంలో బ్యారెల్‌కు 119 డాలర్ల వరకు వెళ్లగా, ప్రస్తుతం 100 డాలర్ల పైనే ట్రేడ్‌ అవుతున్నాయి. మన దేశ చమురు, గ్యాస్‌ అవసరాల్లో 88 శాతం దిగుమతి చేసుకుంటుండడం తెలిసిందే. వీటిలో ఎక్కువ భాగం హార్మూజ్‌ జలసంధి నుంచే వస్తుంటాయి.  

ఎగుమతిదారులకు అండ.. 
ఈ సంక్షోభం కారణంగా ఎగుమతిదారులు సరుకుల రవాణాలో ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో..  దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎగుమతిదారులకు కొన్ని సడలింపులు ఇచి్చంది. రూ.497 కోట్లతో ‘రిలీఫ్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడం తెలిసిందే. దీంతో నౌకా రవాణా మార్గం మార్చుకోవడం కారణంగా అధిక సమయం పట్టడం, ట్రాన్స్‌íÙప్‌మెంట్‌ హబ్‌ల వద్ద రద్దీ పెరగడం, బీమా చార్జీలు పెరగడం, అత్యవసర సర్‌చార్జీలు విధించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనివల్ల రవాణా (లాజిస్టిక్స్‌) ఖర్చులు పెరిగిపోయాయి. ఇలా పెరిగిన రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలను ఎదుర్కొనేందుకు రిలీఫ్‌ పథకం సాయం అందించనుంది. అలాగే, రాడ్‌టెప్‌ పథకం కింద ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31, 2026 వరకు అన్ని అర్హత గల ఉత్పత్తులపై పూర్తి ప్రయోజనాలను ప్రభుత్వం పునరుద్ధరించింది. గత నెలలో ఈ ప్రయోజనాలను సగానికి తగ్గించడంతో ఎగుమతిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో వాటిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది.  

తక్షణ ఉపశమనం అవసరం.. 
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అధికంగా ప్రభావితమయ్యే వర్గాలు, వ్యాపారాలకు తక్షణ ఉపశమనం అవసరం. అదే సమయంలో వ్యూహాత్మక, దీర్ఘకాల అవసరాలకు వీలుగా తగినంత ద్రవ్య వెసులుబాటు కూడా అవసరమే. కేవలం ఇంధన అవసరాలే కాకుండా.. పలు కమోడిటీలు, మెటీరియల్స్‌ పరంగానూ దీర్ఘకాల నిల్వలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది’’అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ తాజాగా నెలవారీ ఆర్థిక సమీక్ష వివరాలు విడుదల సందర్భంగా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement