
క్యూ1లో నికర లాభం
రూ. 26,994 కోట్లు; 78% జంప్
ఆదాయం రూ. 2.48 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2025–26, క్యూ1)లో పటిష్ట ఫలితాలు సాధించింది. కంపెనీ చరిత్రలోనే ఒక క్వార్టర్‌లో అత్యధికంగా రూ. 26,994 కోట్ల రికార్డు నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో సాధించిన రూ. 15,138 కోట్లతో పోలిస్తే ఇది 78 శాతం వృద్ధి. ఇందుకు ప్రధానంగా భారీగా ఇతర ఆదాయం లభించడం, పటిష్టమైన కన్జూమర్ బిజినెస్ వృద్ధి దోహదపడ్డాయి.
కాగా, మొత్తం ఆదాయం 5 శాతం బలపడి రూ. 2.48 లక్షల కోట్లను తాకింది. గతేడాది క్యూ1లో రూ. 2.36 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో లభించిన ఇతర ఆదాయంలో రూ.8,924 కోట్ల లిస్టెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఏషియన్ పెయింట్స్) విక్రయం ప్రధానంగా నిలిచింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. కాగా, ప్రధాన విభాగం చమురు శుద్ధి, పెట్రోకెమికల్ (ఓటూసీ) బిజినెస్ 1.5 శాతం నీరసించింది. ముడిచమురు ధరలు క్షీణించడంవంటివి ప్రభావం చూపాయి.
ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ షేరు బీఎస్‌ఈలో యథాతథంగా రూ. 1,477 వద్ద ముగిసింది.
జియో ప్లాట్‌ఫామ్స్ జోరు
నికర లాభం రూ. 7,110 కోట్లు
ఆర్‌ఐఎల్ టెలికం, డిజిటల్ బిజినెస్‌ల విభాగం.. జియో ప్లాట్‌ఫామ్స్ క్యూ1 నికర లాభం 25% వృద్ధితో రూ. 7,110 కోట్లను తాకింది. స్థూల ఆదాయం 19% ఎగసి రూ. 41,054 కోట్లకు చేరింది. మొబిలిటీ, హోమ్స్ విభాగంలో సబ్ర్‌స్కయిబర్లు పెరగడం, డిజిటల్ సరీ్వసుల బిజినెస్ బలపడటం ఇందుకు సహకరించాయి. ఈ కాలంలో 20 కోట్ల 5జీ వినియోగదారులను దాటడం, 2 కోట్ల హోమ్ కనెక్ట్స్‌కు చేరడం ద్వారా జియో సరికొత్త గరిష్టాలకు చేరినట్లు మాతృ సంస్థ ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 7.4 మిలియన్ సబ్‌స్క్రయిబర్లతో జియో ఫైబర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సంస్థగా అవతరించినట్లు వెల్లడించారు.
రిటైల్ లాభం రూ. 3,271 కోట్లు
ఆర్‌ఐఎల్ రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం క్యూ1లో 28 శాతం జంప్‌చేసి రూ. 3,271 కోట్లను తాకింది. వివిధ విభాగాలలో వృద్ధి ఇందుకు దోహదపడింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,549 కోట్లు మాత్రమే ఆర్జించింది. స్థూల ఆదాయం 11 శాతం పుంజుకుని రూ. 84,171 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 75,615 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో కొత్తగా 388 స్టోర్లను తెరిచింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 19,592కు చేరింది. నిర్వహణ సామర్థ్యం, ప్రాంతాలవారీగా విస్తరణ, ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోపై నిరంతరం దృష్టి పెట్టడంతో రిలయన్స్ రిటైల్ నిలకడైన పనితీరును చూపినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలియజేశారు.
రిలయన్స్ అన్ని విభాగాలలో పటిష్ట నిర్వహణ, ఆర్థిక పనితీరుతో కొత్త ఏడాదిని ప్రారంభించింది. అంతర్జాతీయ ఆటుపోట్ల మధ్య ఏడాది క్రితంతో పోలిస్తే కన్సాలిడేటెడ్ ఇబిటా భారీగా మెరుగుపడింది. ఇంధన మార్కెట్లలో అత్యంత అనిశి్చత పరిస్థితులున్నప్పటికీ ఓటూసీ బిజినెస్ పటిష్ట వృద్ధిని సాధించింది. జియో–బీపీ నెట్‌వర్క్ ద్వారా విలువ జోడింపు సొల్యూషన్లకు తెరతీశాం. తద్వారా దేశీ డిమాండును అందుకున్నాం. ఇంధనం, పెట్రో ప్రొడక్టుల మార్జిన్లు దన్నుగా నిలిచాయి.
– ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్–ఎండీ