డచ్‌ టెల్కోపై రిలయన్స్‌ కన్ను

Reliance considers 5. 7 billion dollers offer for T-Mobile Netherlands - Sakshi

టీ–మొబైల్‌ నెదర్లాండ్స్‌ కొనుగోలుకు ప్రయత్నాలు

5.7 బిలియన్‌ డాలర్ల ఆఫర్‌ ఇచ్చే అవకాశం

రుణదాతల అన్వేషణలో కంపెనీ

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా నెదర్లాండ్స్‌కు చెందిన టెలికం సంస్థ కొనుగోలుపై దృష్టి పెట్టింది. టీ–మొబైల్‌ నెదర్లాండ్స్‌ బీవీలో మెజారిటీ వాటాలను దక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించి ఒక నెల రోజుల్లోగా.. సుమారు 5.7 బిలియన్‌ డాలర్ల డీల్‌ను ఆఫర్‌ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ లావాదేవీకి అవసరమయ్యే నిధులను సమీకరించుకునేందుకు రిలయన్స్‌ ఇప్పటికే రుణదాతలను షార్ట్‌లిస్ట్‌ చేసే ప్రక్రియ మొదలుపెట్టిందని వివరించాయి.

డీల్‌కు కావాల్సిన రుణాన్ని అందించేందుకు పలు దిగ్గజ విదేశీ బ్యాంకులు సిండికేట్‌గా ఏర్పడుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. టీ–మొబైల్‌ నెదర్లాండ్స్‌ కొనుగోలుపై రిలయన్స్‌ గత మూడు నెలలుగా కసరత్తు చేస్తోందని, అప్పట్నుంచి చర్చలు గణనీయంగా పురోగమించాయని వివరించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన టెలికం దిగ్గజం జియో డైరెక్టర్‌గా ఉన్న ఆకాశ్‌ అంబానీ (రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తనయుడు) వ్యక్తిగతంగా ఈ లావాదేవీని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నాయి. టీ–మొబైల్‌ కొనుగోలుతో జియోకి యూరప్‌ టెలికం మార్కెట్లో అడుగుపెట్టేందుకు వీలవుతుంది. అలాగే, ఇతర మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా వ్యాపారపరమైన రిసు్కలను కూడా తగ్గించుకునేందుకు దోహదపడగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.  

టీ–మొబైల్‌ కథ ఇదీ..
జర్మనీకి చెందిన డాయిష్‌ టెలికం ఏజీ .. 2000 సంవత్సరంలో బెల్గాకామ్‌ ఎస్‌ఏ, టెలి డాన్మార్క్‌తో జాయింట్‌ వెంచర్‌ కంపెనీలో కొంత వాటాలను కొనుగోలు చేయడం ద్వారా నెదర్లాండ్స్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. మిగతా వాటాలను కూడా దక్కించుకున్న తర్వాత టీ–మొబైల్‌ నెదర్లాండ్స్‌ కింద తిరిగి పేరు మార్చింది. 2019లో టెలీ2 ఏబీ కార్యకలాపాలను టీ–మొబైల్‌ నెదర్లాండ్స్‌ విలీనం చేసుకుంది. టీ–మొబైల్‌ నెదర్లాండ్స్‌లో డాయిష్‌ టెలికంనకు 75 శాతం, టెలీ2కి మిగతా వాటా ఉంది. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో అతి పెద్ద టెలికం సంస్థ అయిన టీ–మొబైల్‌కు 57 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. మరో అనుబంధ సంస్థ ద్వారా డాయిష్‌ టెలికంనకు, అమెరికాలోని టీ–మొబైల్‌లో కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో వాటాలు ఉన్నాయి. అమెరికాలో టెలికం స్పెక్ట్రం కొనుగోలు చేసేందుకు 2015లోనే టీ–మొబైల్‌ నెదర్లాండ్స్‌ను విక్రయించాలని డాయిష్‌ టెలికం భావించింది. కానీ, తర్వాత ఆ ప్రతిపాదన విరమించుకుంది. టీ–మొబైల్‌ నెదర్లాండ్స్‌కు బ్రిటన్‌లో కూడా గణనీయంగా వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top