క్యూ1లో ముడివ్యయాల ఎఫెక్ట్‌

Raw costs were heavy in the first quarter - Sakshi

దేశీ కార్పొరేట్ల లాభాలకు చెక్‌

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక

ముంబై: దేశీ కార్పొరేట్లకు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ముడివ్యయాలు భారంగా పరిణమించినట్లు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక పేర్కొంది. దీంతో ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నిర్వహణా లాభ మార్జిన్లు సగటున 2.13 శాతంమేర క్షీణించినట్లు తెలియజేసింది. వెరసి క్యూ1లో ఆదాయం 39 శాతం జంప్‌చేసినప్పటికీ ముడివ్యయాల ద్రవ్యోల్బణ ప్రభావంతో ఇబిటా మార్జిన్లు 17.7 శాతానికి పరిమితమైనట్లు వివరించింది. కమోడిటీ, ఇంధన ధరల పెరుగుదలను కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయడంతో ఆదాయంలో వృద్ధి నమోదైనట్లు తెలియజేసింది. అయితే వీటి కారణంగా లాభదాయకత నీరసించినట్లు తెలియజేసింది. ఫైనాన్షియల్‌ రంగ సంస్థలను మినహాయించి 620 లిస్టెడ్‌ కంపెనీలను నివేదికకు ఇక్రా పరిగణించింది.

నివేదిక ప్రకారం..యుద్ధం ప్రభావం
రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధంతో ఎదురైన సరఫరా సవాళ్లు సైతం మార్జిన్లు మందగించేందుకు కారణమయ్యాయి. అయితే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి మార్జిన్లు పుంజుకునే వీలుంది. గతేడాది(2021–22) తొలి క్వార్టర్‌లో కరోనా మహామ్మారి రెండో వేవ్‌ కారణంగా అమ్మకాలు దెబ్బతినడం.. ఈ ఏడాది క్యూ1 అమ్మకాల్లో వృద్ధికి దోహదం చేసింది. పలు రంగాలలో ప్రొడక్టుల ధరల పెంపు సైతం దీనికి జత కలిసింది. కాగా.. గ్రామీణ ప్రాంతాల నుంచి కొన్ని రంగాలకు డిమాండ్‌ తగ్గింది. ఇది ఇటు అమ్మకాలు, అటు లాభదాయకతకు కొంతమేర చెక్‌ పెట్టాయి. ఇక రంగాలవారీగా చూస్తే.. హోటళ్లు, విద్యుత్, రిటైల్, చమురు– గ్యాస్‌ విభాగాలు క్యూ1లో ఊపందుకోగా.. ఎయిర్‌లైన్స్, నిర్మాణం, క్యాపిటల్‌ గూడ్స్, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ వెనకడుగు వేశాయి. పలు ప్రొడక్టులకు ధరల పెంపు చేపట్టిన ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఓ మాదిరి వృద్ధి నమోదైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top