గ్లోబల్ ఎకానమీ రికవరీకి తిరుగులేదు | Sakshi
Sakshi News home page

గ్లోబల్ ఎకానమీ రికవరీకి తిరుగులేదు

Published Fri, Mar 12 2021 2:23 PM

PWC Survey: 76pc of CEOs Predict Global Economy Recovery in 2021 - Sakshi

న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సవాళ్ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2021లో వృద్ధి బాటకు మళ్లుతుందన్న విశ్వాసాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు (సీఈఓ) వ్యక్తం చేశారు. సంస్థల ఆదాయాలు పెరుగుతాయన్న ధీమానూ వెలిబుచ్చారు. ఇందుకు సంబంధించి వారి ఆశావాద దృక్పథం ‘‘రికార్డు స్థాయిల్లో’’ ఉంది. ప్రముఖ కన్సల్టెన్సీ పీడబ్ల్యూసీ 24వ వార్షిక గ్లోబల్‌ సీఈఓ సర్వే ఈ విషయాన్ని తెలిపింది. సర్వేకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

  • భారత్‌సహా 100దేశాలకు చెందిన 5,050 మంది సీఈఓలు జనవరి, ఫిబ్రవరిల్లో జరిగిన ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 
  • వీరిలో 36 శాతం మంది తమ కంపెనీల ఆదాయాలు వచ్చే 12 నెలల్లో పెరుగుతాయన్న ధీమాను వ్యక్తం చేశారు. 2020లో ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన సీఈఓలు 27 శాతమే . 
  • 2021లో గ్లోబల్‌ ఎకానమీ రికవరీ ఖాయమని 76% మంది సీఈఓలు అభిప్రాయపడ్డారు. 2012 తర్వాత ఈ స్థాయిలో రికవరీపై విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. 2019లో ఈ పరిమాణం 42 శాతం. 2020లో 22 శాతం.
  • గ్లోబల్‌ ఎకానమీ వృద్ధిపై అత్యధిక సంఖ్యలో విశ్వాసం వ్యక్తం చేసిన వారిలో నార్త్‌ అమెరికా, పశ్చిమ యూరోప్‌లకు చెందినవారు ఉన్నారు.
  • అయితే కరోనా తరహా మరో మహమ్మారి విజృంభిస్తే మాత్రం పరిస్థితిగా కఠినంగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా సీఈఓలు ఆందోళన వ్యక్తం చేశారు. 
  • అంతర్జాతీయంగా పలు కంపెనీలు డిజిటల్‌ సొల్యూషన్స్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయంగా భాగస్వామ్యాలను విస్తరించుకోడానికి వ్యూహ రచన చేస్తున్నాయి. ఇదే సమయంలో సైబర్‌ పరమైన ఇబ్బందులను ఎదుర్కొనడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. 
  • సీఈఓల్లో 30 శాతం మంది వాతావరణ మార్పు పట్ల ఆందోళన వ్యక్త చేశారు. 2020లో ఇది 24 శాతంగా ఉంది. అయితే వాతావరణ మార్పిడి వల్ల తక్షణం వృద్ధికి వచ్చిన విఘాతం ఏదీ లేదని 27 శాతం మంది సీఈఓలు అభిప్రాయపడ్డారు. 

సీఈఓల ముందు రెండు సవాళ్లు...
చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు (సీఈఓ) ప్రధానంగా ప్రస్తుతం రెండు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయా సంస్థల కార్యకలాపాల్లో పాలుపంచుకునే వర్గాల్లో విస్తృత ప్రాతిపదిక విశ్వాసాన్ని ఎలా పెంపొందించాలన్న అంశం ఇందులో ఒకటి. మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో వేగంగా మారిపోతున్న అంతర్జాతీయ పరిణామాలను తమ వ్యాపార కార్యకలాపాలకు అనుసంధానించుకుని తద్వారా పటిష్ట స్థాయిలో ఆటుపోట్లను తట్టుకోవడం ఎలా అన్న అంశం రెండవది. 
- సంజీవ్‌ కృష్ణన్, పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్‌

2022 వరకూ ‘‘కరోనా ముందస్తు’’కు రాలేం: మూడీస్‌
2021లో వృద్ధి రికవరీ బాటన పడినప్పటికీ, ‘‘కరోనా ముందస్తు క్రియాశీలత’’ స్థాయికి 2022 వరకూ చేరుకోవడం కష్టమేనని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ-మూడీస్‌ తన తాజా నివేదికలో గురువారం పేర్కొంది. 2022 వరకూ పలు దేశాల ఎకానమీలు కరోనా ముందస్తు కాలానికి చేరుకోలేవని విశ్లేషించింది. ‘‘2020 మార్చి 11వ తేదీన కోవిడ్‌-19ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. అటు తర్వాత గ్లోబల్‌ ఎకానమీ తీవ్ర ప్రతికూలతలో పడిపోయింది. బాండ్‌ డిఫాల్ట్స్‌ పెరిగాయి. రుణ వ్యవస్థ నేల చూపుచూసింది. అయితే రుణ వ్యవస్థ తిరిగి ఇప్పుడు కోలుకుంటోంది. అయితే ఇది ప్రస్తుతానికి స్వల్పకాలిక ధోరణి మాత్రమే. పలు రంగాలకు ఇంకా ఇబ్బందులు తొలగిపోలేదు. కరోనా ముందటి కార్యకలాపాలకు అవి ఇంకా చేరుకోలేదు. దీనికి ఇంకా సమయం పడుతుంది’’ అని మూడీస్‌ తన గ్లోబల్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. 

ఆర్థిక క్రియాశీలతకు ప్రభుత్వాలు, సెంట్రల్‌ బ్యాంకుల విధానపరమైన చర్యలు తమ మద్దతును కొనసాగిస్తాయన్న విశ్లేషణ చేసింది. వ్యాక్సినేషన్‌ కార్యకలాపాలు విస్తృతం అవుతున్న నేపథ్యంలో మహమ్మరి ప్రభావం కూడా ఈ ఏడాది క్రమంగా తగ్గుతుందన్న విశ్వాసాన్ని మూడీస్‌ వ్యక్తం చేసింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా కఠిన లాక్‌డౌన్‌ పరిస్థితులను ఆయా ప్రభుత్వాలు క్రమంగా పూర్తి స్థాయిలో తొలగిస్తాన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయితే వృద్ధి తీరుపై కరోనా సవాళ్ల ప్రభావం మరికొంతకాలం కొనసాగుతుందని విశ్లేషించింది. ‘‘దీనికితోడు కొత్త మ్యుటేషన్ల సవాళ్లు పెరుగుతూనే ఉంటాయి. సాధారణ పరిస్థితులు నెలకొనే సమయంలో ఇదొక సవాలుగానే ఉంటుంది. వైరస్‌ను పూర్తిగా నిర్మూలిద్దామనే యోచనకు బదులు, దానితో కలిసి జీవించడం ఎలా అన్న అంశంపైనే దృష్టి పెట్టాలి. తక్కువ స్థాయిలో కేసులు ఉన్నప్పటికీ, ఈ ధోరణి తప్పదు’’ అని మూడీస్‌ స్పష్టం చేసింది. ఆర్థిక, ఫైనాన్షియల్‌ వ్యవస్థలకు వైరస్‌ వల్ల ఊహించిన పరిణామాలు, ప్రతికూలతలు ఎదురయితే తప్ప, ప్రస్తుత పరిస్థితుల్లో విస్తృత ప్రాతిపదికన క్రెడిట్‌ రేటింగ్స్‌ సమీక్షలు జరుగుతాయని భావించనక్కర్లేదని కూడా మూడీస్‌ పేర్కొనడం గమనార్హం.

చదవండి:

‘వరల్డ్‌ వైడ్‌ వెబ్‌’ కోటకు బీటలు

సింగిల్ ఛార్జింగ్ తో 240 కి.మీ ప్రయాణం

Advertisement
 
Advertisement
 
Advertisement