క్యూ1లో పీఈ పెట్టుబడులు డీలా!

Private Equity Investments Into Domestic Companies Fell 17 Per Cent To Usd 6.72 Billion  - Sakshi

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి క్వార్టర్‌లో ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు దేశీ కంపెనీలలో 17 శాతం క్షీణించాయి. వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో 6.72 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 53,000 కోట్లు)కు పరిమితమయ్యాయి. డీల్స్‌ సైతం 15 శాతం నీరసించి 344కు చేరాయి. 

గతేడాది(2021–22) క్యూ1లో 8.13 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇక గతేడాది జనవరి–మార్చి(క్యూ4)లో తరలివచ్చిన 8.97 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే త్రైమాసికవారీగా 25 శాతం తగ్గాయి. లావాదేవీల సమీక్షా సంస్థ, లండన్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీ గ్రూప్‌ కంపెనీ రెఫినిటివ్‌ వెల్లడించిన గణాంకాలివి. కాగా.. ఈ క్యాలండర్‌ ఏడాది(2022)లో తొలి ఆరు నెలల(జనవరి–జూన్‌)ను పరిగణిస్తే.. దేశీ కంపెనీలలో పీఈ పెట్టుబడులు 26 శాతం పుంజుకుని 15.7 బిలియన్‌ డాలర్లను తాకాయి.  

టెక్నాలజీ స్పీడ్‌ 
2022 జనవరి–జూన్‌ మధ్య పీఈ పెట్టుబడుల్లో టెక్నాలజీ రంగానికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. మొత్తం పెట్టుబడుల్లో 73 శాతానికిపైగా అంటే 6.53 బిలియన్‌ డాలర్లను టెక్‌ రంగం సొంతం చేసుకుంది. ఏడాదిక్రితంతో పోలిస్తే ఇండియా ఆధారిత ఫండ్స్‌ రెట్టింపునకుపైగా 7 బిలియన్‌ డాలర్లను సమీకరించినట్లు రెఫినిటివ్‌ పేర్కొంది. ఈ పెట్టుబడులు సైతం వెచ్చించవలసి ఉన్నట్లు తెలియజేసింది. 

ఇక పరిశ్రమలవారీగా చూస్తే ఇంటర్నెట్, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, రవాణా గరిష్టంగా పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అయితే బయోటెక్నాలజీ, మెడికల్‌– హెల్త్‌ విభాగాలకు పెట్టుబడులు భారీగా నీరసించాయి. కాగా.. తొలి అర్ధభాగంలో 10 పీఈ డీల్స్‌లో వెర్సే ఇన్నోవేషన్‌(82.77 కోట్ల డాలర్లు), థింక్‌ అండ్‌ లెర్న్‌(80 కోట్ల డాలర్లు), బండిల్‌ టెక్నాలజీస్‌(70 కోట్ల డాలర్లు), టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ(49.47 కోట్ల డాలర్లు), ఎన్‌టెక్స్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసెస్‌(330 కోట్ల డాలర్లు), డెల్హివరీ(30.4 కోట్ల డాలర్లు) బిజీబీస్‌ లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌(30 కోట్ల డాలర్లు) చోటు చేసుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top