
మ్యాగ్మా ఇన్సూరెన్స్ కొనుగోలుకి సై
ఒప్పందం విలువ రూ.4,500 కోట్లు
ఎఫ్‌ఎంసీజీ, హెర్బల్ ప్రొడక్టుల దిగ్గజం పతంజలి ఆయుర్వేద్ సాధారణ బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు వీలుగా మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనుంది. మ్యాగ్మా కొనుగోలుకి అదార్ పూనావాలా సంస్థ సనోటీ ప్రాపర్టీస్‌తో షేరు కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీఏ) కుదుర్చుకుంది. రైజింగ్ సన్ హోల్డింగ్స్‌తో ఏర్పాటైన భాగస్వామ్య కంపెనీ(జేవీ) మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్‌లో సనోటీకి మెజారిటీ వాటా ఉంది. వెరసి మ్యాగ్మా కొనుగోలుకి ధరమ్‌పాల్ సత్యపాల్(డీఎస్) గ్రూప్‌తో కలసి పతంజలి రూ.4,500 కోట్లు వెచ్చించనుంది. సెలికా డెవలపర్స్, జాగ్వార్ అడ్వయిజరీ సర్వీసెస్‌తో కలసి డీల్‌కు సనోటీ బోర్డు ఆమోదముద్ర వేసింది. సాధారణ బీమా రంగంలో 70 ప్రొడక్టులతో కార్యకలాపాలు విస్తరించిన మ్యాగ్మా 2023–24లో రూ.3,295 కోట్ల స్థూల ప్రీమియం(జీడబ్ల్యూపీ)ను అందుకుంది. ఈ ఏడాది(2024–25) రూ.3,700 కోట్ల జీడబ్ల్యూపీ సాధించగలమని భావిస్తోంది.
ఇదీ చదవండి: భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు ఇలా..
వస్తువులు సాధారణరంగా జరిగే ప్రమాదాలవల్ల పాడైనప్పుడు లేదా దొంగతనం అయినప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ దన్నుగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ఆర్థికంగా నష్టాన్ని భర్తీ చేస్తుంది. వివిధ కంపెనీలు సాధారణ బీమాను కింది రూపాల్లో అందిస్తున్నారు.
ఆరోగ్య బీమా: అనారోగ్యంతో కారణంగా వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.
మోటార్ ఇన్సూరెన్స్: వాహనానికి జరిగే ప్రమాదాలు లేదా వాహనం వల్ల ఇతరులకు జరిగే ప్రమాదాలను కవర్ చేస్తుంది.
హోమ్ ఇన్సూరెన్స్: అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు వంటి ప్రమాదాల నుంచి ఇంటిని అందులోని వస్తువులకు రక్షణగా నిలుస్తుంది.
ట్రావెల్ ఇన్సూరెన్స్: ప్రయాణ సమయంలో ట్రిప్ క్యాన్సిలేషన్, లగేజీ పోయినా లేదా విదేశాల్లో మెడికల్ ఎమర్జెన్సీ వంటి అనుకోని సంఘటనలకు కవరేజీని అందిస్తుంది.
వాణిజ్య బీమా: ఆస్తి నష్టం, ఉద్యోగి సంబంధిత సమస్యలు వంటి ప్రమాదాల నుంచి వ్యాపారాలకు రక్షణ కల్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment