సూక్ష్మ రుణ సంస్థల రుణాలు రూ.3.25 లక్షల కోట్లు

Outstanding microfinance loan portfolio to rise 20. 3percent in FY23 - Sakshi

డిసెంబర్‌ నాటికి వసూలు కావాల్సిన మొత్తం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం పెరుగుదల

కోల్‌కతా: సూక్ష్మ రుణ సంస్థలకు (ఎంఎఫ్‌ఐ) సంబంధించి వసూలు కావాల్సిన రుణాల పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ నాటికి రూ.3.25 లక్షల కోట్లకు పెరిగింది. 2022 మార్చి నాటికి ఇది రూ.2.7 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 20 శాతం పెరిగినట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్‌వర్క్‌ (ఎంఫిన్‌) ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ రంగం 1.32 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు ఎంఫిన్‌ సీఈవో అలోక్‌ మిశ్రా తెలిపారు. సూక్ష్మ రుణ రంగానికి స్వీయ నియంత్రణ మండలిగా ఎంఫిన్‌కు ఆర్‌బీఐ గుర్తింపు ఉంది. కరోనా కారణంగా 2021, 2022లో రుణ వసూళ్ల సామర్థ్యంపై ప్రభావం పడిందని, ప్రస్తుతం వసూళ్లు 97 శాతానికి మెరుగుపడ్డాయని మిశ్రా చెప్పారు.

ఇది కరోనా సమయంలో 70 శాతంగా ఉందన్నారు. ఎంఎఫ్‌ఐ సంస్థల పరిధిలో మొత్తం 6.2 కోట్ల మంది రుణ లబ్ధిదారులుగా ఉన్నారని.. దేశ జీడీపీకి ఎంఎఫ్‌ఐ రంగం 2.7 శాతం సమకూరుస్తున్నట్టు చెప్పారు. ఎంఎఫ్‌ఐల మొత్తం రుణాల్లో రూ.38,000 కోట్లు (17 శాతం) పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం నుంచి ఉన్నట్టు తెలిపారు. 2022 మార్చిలో ఆర్‌బీఐ ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐ రంగానికి ప్రకటించిన మార్గదర్శకాలపై మిశ్రా స్పందిస్తూ.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఫిన్‌లు, ఎన్‌బీఎఫ్‌సీ మధ్య తగిన పోటీకి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఫిన్‌ సంస్థలు వసూలు చేసే సగటు వడ్డీ రేటు రుణంపై ప్రస్తుతం 24 శాతంగా ఉంటుందని తెలిపారు. గతంలో ఇది 22.5 శాతమే ఉండేదంటూ, ఆర్‌బీఐ రెపో రేటు పెంచినందున ఎంఫిన్‌లు వసూలు చేసే వడ్డీ రేటు కూడా పెరిగినట్టు వివరించారు. ఎంఫిన్‌ పరిధిలో 47 సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.  

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top