చమురు భగభగ.. భారత్‌కు సౌదీ ఉచిత సలహా

OPEC And Allies Keep Oil Production Steady As Saudi Arabia Urges Caution - Sakshi

14 నెలల గరిష్టానికి క్రూడాయిల్‌ ధర

బ్రెంట్‌ 68.. నైమెక్స్‌ 66 డాలర్లకు..

ఉత్పత్తిపై నియంత్రణలు సడలించాలని భారత్‌ విజ్ఞప్తి

ఒపెక్‌ దేశాల నిరాకరణ

లండన్‌: డిమాండ్‌ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు భావిస్తున్న నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరుగుతున్నా యి. గురువారం 4% ఎగిసిన ధరలు శుక్రవారం మరో రెండు శాతం పైగా పెరిగాయి. 14 నెలల గరిష్ట స్థాయిని తాకాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ రేటు బ్యారెల్‌కు 2.3 శాతం దాకా పెరిగి 68.26 డాలర్లకు చేరింది.

అటు నైమెక్స్‌ క్రూడాయిల్‌ ధర దాదాపు 2% పైగా పెరిగి 66.23 డాలర్ల స్థాయిని తాకింది. ఒపెక్, దాని అనుబంధ దేశాలు ఏప్రిల్‌లోనూ ఉత్పత్తి గణనీయంగా పెంచరాదని నిర్ణయించుకున్నాయి. రష్యా, కజకిస్తాన్‌లకు స్వల్ప మినహాయింపునివ్వడం తప్ప మిగతా దేశాలన్నీ కూడా ఉత్పత్తిపై నియంత్రణ కొనసాగించాలని తీర్మానించుకున్నాయి. ఒపెక్‌ దేశాలు కనీసం రోజుకు 15 లక్షల బ్యారెళ్ల మేర (బీపీడీ) ఉత్పత్తి పెంచుతాయని మార్కెట్‌ వర్గాలు భావించినప్పటికీ.. దానికి విరుద్ధంగా 1.5 లక్షల బీపీడీకి మాత్రమే ఒపెక్, అనుబంధ దేశాలు నిర్ణయించడం మార్కెట్‌ వర్గాలను నిరాశపర్చిందని యూబీఎస్‌ అనలిస్ట్‌ జియోవాని స్టానొవో పేర్కొన్నారు.

జనవరి 2020: క్రూడ్‌ గరిష్ట రేటు 65.65 డాలర్లు
ఏప్రిల్‌ 2020: క్రూడ్‌ కనిష్ట రేటు మైనస్‌ 40.32 డాలర్లు
మార్చి 5 2021: క్రూడ్‌ గరిష్ట రేటు  66.23 డాలర్లు

అంచనాల్లో సవరణలు..
ఒపెక్, అనుబంధ దేశాలు సరఫరాపై నియంత్రణలు కొనసాగించనున్న నేపథ్యంలో విశ్లేషకులు... ముడిచమురు ధరల అంచనాలను కూడా సవరించడం ప్రారంభించారు. రెండో త్రైమాసికంలో బ్రెంట్‌ క్రూడ్‌ రేటు మరో 5 డాలర్లు పెరిగి 75 డాలర్లకు (బ్యారెల్‌కు) చేరవచ్చని, మూడో త్రైమాసికానికి 80 డాలర్లకు చేరొచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో బ్రెంట్‌ రేటు 75 డాలర్లకు (బ్యారెల్‌కు), నైమెక్స్‌ క్రూడ్‌ 72 డాలర్లకు (బ్యారెల్‌కు) చేరొచ్చని యూబీఎస్‌ అంచనాలను సవరించింది.

భారత్‌కు సౌదీ ఉచిత సలహా..
చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఉత్పత్తిపై నియంత్రణలను సడలించాలని భారత్‌ చేసిన విజ్ఞప్తిని ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సౌదీ అరేబియా ఉచిత సలహా ఇచ్చింది. ఒపెక్, అనుబంధ దేశాల నిర్ణయంపై జరిగిన విలేకరుల సమావేశంలో సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్‌ అబ్దుల్‌అజీజ్‌ బిన్‌ సల్మాన్‌.. భారత్‌ విజ్ఞప్తిపై స్పందించారు. ‘భారత్‌ విషయానికొస్తే గతేడాది ఏప్రిల్, మే, జూన్‌లో చౌకగా కొనుగోలు చేసిన చమురును ప్రస్తుతం ఉపయోగించుకోవాలని మా మిత్ర దేశాన్ని కోరుతున్నాము‘ అని ఆయన వ్యాఖ్యానించారు.

2020 ఏప్రిల్‌-మే మధ్యన భారత్‌ 16.71 మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్‌తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాటక)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది.  కేంద్రచమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవలే చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్‌ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్‌ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్‌ అప్పట్లో హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతున్నా ఉత్పత్తి సాధారణ స్థితికి రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రికార్డు స్థాయిలో పెట్రో రేట్లు..
గతేడాది ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్యలో భారత్‌ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు రేటు బ్యారెల్‌కు 50 డాలర్ల కన్నా తక్కువే ఉన్నప్పటికీ దేశీయంగా రిటైల్‌ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్‌ రేట్లపై ఎక్సైజ్‌‌ డ్యూటీని ప్రభుత్వం పెంచుకుంటూ వస్తుండటం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం ఢిల్లీలోని రేట్ల ప్రకారం పెట్రోల్‌ ధరలో మూడో వంతు ఎక్సైజ్‌ డ్యూటీ ఉంటుండగా, డీజిల్‌ ధరలో 40% దాకా ఉంటోంది. దీనికి రాష్ట్రాల   పన్నులూ తోడవడం రేట్లకు మరింతగా ఆజ్యం పోస్తోంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర ఇప్పటికే రూ. 100 దాటేసింది. అంతర్జాతీయంగా క్రూడ్‌ రేట్లు ఇంకా పెరిగితే దేశీయంగా ఇంధనాల రిటైల్‌ రేట్లు మరింతగా ఎగిసే అవకాశం ఉంది.

క్రూడ్‌ సెగకు కరిగిన రూపాయి
19 పైసల పతనంతో 73 దిగువకు
ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల, దేశీయ మార్కెట్ల తాజా బలహీన దోరణి ఎఫెక్ట్‌ రూపాయిపై పడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 19 పైసలు బలహీనపడి 73.02కు బలహీనపడింది. ఫెడ్‌ ఫండ్‌ రేటు (ప్రస్తుతం 0.00–0.25 శాతం శ్రేణి)  మరింత తగ్గబోదని  అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌- ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌  సంకేతాలు ఇచ్చారన్న విశ్లేషణలు, దీనితో ఇక ఈజీ మనీకి ముగింపు పలికినట్లేనన్న అంచనాలు, వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంకేతాల నేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌  మూడు నెలల గరిష్టానికి (91.94) చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top