ఓఎన్‌జీసీ ‘జాక్-అప్ రిగ్‌’ టెండర్ రద్దు! | ONGC Cancels Oil Rig Tender Amid Price Surge and Collusion Concerns | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ ‘జాక్-అప్ రిగ్‌’ టెండర్ రద్దు!

Apr 22 2026 1:37 PM | Updated on Apr 22 2026 2:18 PM

ONGC Cancels Oil Rig Tender Amid Price Surge and Collusion Concerns

ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్‌జీసీ సముద్ర గర్భంలో చమురు అన్వేషణ కోసం నిర్వహించిన జాక్-అప్ రిగ్‌(సముద్ర తీర ప్రాంతాల్లో చమురు బావులను తవ్వడానికి ఉపయోగించే తేలియాడే ప్లాట్‌ఫామ్) టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బిడ్డింగ్ ప్రక్రియలో ధరల అసాధారణ పెరుగుదల, గుత్తాధిపత్య ధోరణులు కనిపిస్తున్నాయనే అనుమానాల నేపథ్యంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

ధరల పెరుగుదలపై అనుమానాలు

ఈ టెండర్ ప్రక్రియను నిశితంగా పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని ఓఎన్జీసీ తెలిపింది. ‘కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే బిడ్డింగ్ ధరలు సుమారు 60% మేర పెరిగాయి. గతంలో రోజుకు 35,606 డాలర్లుగా ఉన్న రేటు తాజా బిడ్డింగ్‌లో ఏకంగా 56,195 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, అంచనాలతో పోల్చి చూస్తే ఈ స్థాయి పెరుగుదల ఏమాత్రం సహేతుకం కాదని, ఇది ఆరోగ్యకరమైన పోటీ మార్కెట్ పరిమితులను మించి ఉందని సంస్థ స్పష్టం చేసింది.

కుట్ర కోణంపై ఆందోళన

టెండర్లలో పాల్గొన్న సంస్థల మధ్య కుట్ర పద్ధతులు ఉండవచ్చనే ఓఎన్జీసీ ఆందోళన వ్యక్తం చేసింది. బిడ్ల నమూనాను విశ్లేషించగా సంస్థల మధ్య రహస్య ఒప్పందాలు ఉండవచ్చని, తద్వారా కృత్రిమంగా ధరలను పెంచే ప్రయత్నం జరిగిందని సంస్థ భావిస్తోంది. ‘ప్రజా సేకరణ నిబంధనలకు కట్టుబడి ఉండటం, ప్రభుత్వ నిధులను వివేకవంతంగా వినియోగించడం మా బాధ్యత. ఈ టెండర్ ప్రక్రియలో సమగ్రత లోపించిందని భావించినందుకే రద్దు నిర్ణయం తీసుకున్నాం’ అని ఓఎన్జీసీ అధికారిక ప్రకటనలో తెలిపింది.

పారదర్శకతకే ప్రాధాన్యత

మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన ఓఎన్జీసీ తమ నిర్ణయం పూర్తిగా సంస్థాగత ప్రయోజనాలు, పారదర్శకతపై ఆధారపడి ఉందని స్పష్టం చేసింది. ‘ఈ నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి బాహ్య ఒత్తిళ్లు లేవు. ప్రభుత్వ సేకరణ సూత్రాలను కచ్చితంగా పాటిస్తూ అక్రమాలకు తావులేకుండా చూడటమే లక్ష్యం. పరిశ్రమలో గుత్తాధిపత్యాన్ని లేదా సిండికేట్‌గా ఏర్పడి ధరలను శాసించే ధోరణులను అడ్డుకుంటాం’ అని కంపెనీ తెలిపింది.

భవిష్యత్తు కార్యాచరణ

పరిశ్రమ వర్గాలతో పారదర్శకమైన, నిర్మాణాత్మకమైన సంబంధాలను కొనసాగిస్తామని ఓఎన్జీసీ తెలిపింది. భవిష్యత్తులో నిర్వహించే బిడ్ల సేకరణ ప్రక్రియల్లో న్యాయమైన, పోటీతత్వంతో కూడిన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని తద్వారా ప్రాజెక్టుల వ్యయం పెరగకుండా జాగ్రత్త పడతామని సీనియర్ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

Advertisement
 
Advertisement
Advertisement