
ద్విచక్ర ఈవీల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. త్రైమాసికవారీగా ఏప్రిల్–జూన్(క్యూ1)లో మొత్తం ఆదాయం 36 శాతం ఎగసి రూ. 828 కోట్లను తాకింది. గతేడాది(2024–25) చివరి త్రైమాసికం(జననవరి–మార్చి)లో కేవలం రూ. 611 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో 33 శాతం వృద్ధితో 68,192 వాహనాలను డెలివరీ చేసింది. గత క్యూ4లో 51,375 యూనిట్లను డెలివరీ చేసింది. ఆటో బిజినెస్ జూన్‌లో సానుకూల నిర్వహణ లాభం(ఇబిటా)స్థాయికి చేరినట్లు కంపెనీ తెలియజేసింది. ఇందుకు బలపడిన స్థూల మార్జిన్లు దోహదపడినట్లు వెల్లడించింది.
ప్రాజెక్ట్ లక్ష్యనిర్వహణ సామర్థ్యాలను భారీగా మెరుగుపరచినట్లు పేర్కొంది. దీంతో నెలవారీ ఆటో నిర్వహణ వ్యయాలు రూ. 178 కోట్ల నుంచి రూ. 105 కోట్లకు తగ్గినట్లు వివరించింది. కన్సాలిడేటెడ్ నిర్వహణ వ్యయాలు ప్రస్తుతం నెలకు రూ. 150 కోట్లు చొప్పున నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది 3,25,000–3,75,000 వాహనాలు విక్రయించగలమని అంచనా వేసింది. తద్వారా రూ. 4,200–4,700 కోట్ల ఆదాయం సాధించనున్నట్లు అభిప్రాయపడింది. రెండో త్రైమాసికం(జులై–సెపె్టంబర్) నుంచి సానుకూల ఇబిటాను కొనసాగించే వీలున్నట్లు తెలియజేసింది. కొత్తగా విడుదల చేసిన జెన్ 3 స్కూటర్లు క్యూ1 విక్రయాలలో 80 శాతం వాటా ఆక్రమించినట్లు వెల్లడించింది. రోడ్‌స్టెర్ ఎక్స్ మోటార్‌సైకిళ్లు దేశవ్యాప్తంగా 200 స్టోర్లలో అందుబాటులోకిరాగా.. రానున్న పండుగల సీజన్‌లో అమ్మకాలు పుంజుకోనున్నట్లు ఆశిస్తోంది.
టాటా టెక్నాలజీస్ లాభం ప్లస్
క్యూ1లో రూ. 170 కోట్లు
సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీ టాటా టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ.170 కోట్లను అధిగమించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.162 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా నీరసించి రూ.1,244 కోట్లకు పరిమితమైంది. గత క్యూ1లో రూ.1,269 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,072 కోట్ల నుంచి రూ. 1,080 కోట్లకు నామమాత్రంగా పెరిగాయి. క్యూ1ను అప్రమత్తంగా ప్రారంభించినప్పటికీ క్లయింట్లు కంపెనీపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సీఈవో, ఎండీ వారెన్ హారిస్ పేర్కొన్నారు. వెరసి దీర్ఘకాలిక కట్టుబాట్లయిన ప్రొడక్ట్ ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను కొనసాగించనున్నట్లు తెలియజేశారు. దీంతో ఆరు వ్యూహాత్మక డీల్స్ కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఎంబెడ్డెడ్ సాఫ్ట్‌వేర్, పీఎల్‌ఎమ్ సేవలకు వోల్వో కార్స్ వ్యూహాత్మక సరఫరాదారుగా ఎంపిక చేసుకున్నట్లు పేర్కొన్నారు.