పాన్‌–ఆధార్‌ లింక్‌ చేయకపోతే పెనాల్టీ

Not linking PAN and Aadhaar will cost you Rs 500 in first 3 months, After 1000 - Sakshi

మార్చి 31తో ముగియనున్న గడువు

ఆ తర్వాత రూ.500–1,000 చొప్పున వడ్డన

ఇక మీదట గడువు పొడిగింపులు లేనట్టే

న్యూఢిల్లీ: ఆధార్‌తో పాన్‌ అనుసంధానానికి ఇచ్చిన గడువు గురువారం (మార్చి 31)తో ముగియనుంది. గడువులోపు అనుసంధానించుకోని వారు (లింకింగ్‌) ఆ తర్వాత రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గడువులోపు ఆధార్‌తో పాన్‌ లింకింగ్‌ చేసుకోని వారికి కాస్త ఉపశమనం కల్పించింది. 2023 మార్చి 31 వరకు పాన్‌ పనిచేస్తుందని ప్రకటించింది. అప్పటికీ అనుసంధానం చేసుకోకపోతే పాన్‌ పనిచేయకుండా (ఇన్‌ ఆపరేటివ్‌) పోతుంది. ‘‘2022 జూన్‌ 30 వరకు పాన్‌–ఆధార్‌ లింకింగ్‌ చేసుకుంటే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఆ తర్వాత అనుసంధానించుకుంటే రూ.1,000 జరిమానా ఉంటుంది’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిపై ఏకేఎం గ్లోబల్‌ ట్యాక్స్‌ పార్ట్‌నర్‌ అమిత్‌ మహేశ్వరి స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో విడతలుగా పాన్‌–ఆధార్‌ లింకింగ్‌ గడువును పొడిగిస్తూ వచ్చింది. చివరికి ఆలస్యపు రుసుములతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనుసంధానించుకోడంలో విఫలమైతే పాన్‌ పనిచేయదు. దీంతో పన్ను రిటర్నులకు సంబంధించి పాన్‌ అందుబాటులో ఉండదు. కనుక పన్ను చెల్లింపుదారులు అందరూ ఒక్కసారి తమ పాన్, ఆధార్‌తో అనుసంధానమైందీ, లేనిదీ ఆదాయపన్ను శాఖ పోర్టల్‌కు వెళ్లి పరిశీలించుకోవాలి’’ అని పేర్కొన్నారు.  

అన్నింటికీ పాన్‌ అవసరమే..
ఆదాయపన్ను రిటర్నులు దాఖలుతోపాటు ఇతర ఐటీ వ్యవహారాలకు (రిఫండ్‌లు తదితర) ఇక మీదట పాన్‌ ను ఆధార్‌తో అనుసంధానించుకోవడం తప్పనిసరి అని నాంజియా ఆండర్సన్‌ ఎల్‌ఎల్‌పీ పార్ట్‌నర్‌ నీరజ్‌ అగర్వాల్‌ తెలిపారు. బ్యాంకు ఖాతా తెరిచేందుకు, స్థిరాస్తి కొనుగోళ్లకు పాన్‌ తప్పనిసరి. దీంతో పాన్‌ పనిచేయకపోతే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘‘ఒక్కసారి పాన్‌ పనిచేయకుండా పోతే, ఆర్థిక లావాదేవీలు (ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో పెట్టుబడులు) నిర్వహించడానికి అవకాశం ఉండదు. సెక్షన్‌ 171బీ కింద జరిమానాతోపాటు, అధిక టీడీఎస్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అగర్వాల్‌ వివరించారు. గడువులోపు ఏౖదైనా సమస్య వల్ల అనుసంధానం చేసుకోని వారు ఆలస్యపు రుసుము చెల్లించి అయినా 2023 మార్చి 31లోపు లింక్‌ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే పాన్‌ పనిచేయకుండా పోతుందని గుర్తుంచుకోవాలి. 2022 జనవరి 24 నాటికి 43.34 కోట్ల పాన్‌లు ఆధార్‌తో లింక్‌ అయ్యాయి. ఇప్పటి వరకు 131 కోట్ల ఆధార్‌లు జారీ అయ్యాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top