
భారత ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లు అభివృద్ధి చెందాలంటే, స్థూల నిరర్థక ఆస్తులను (జీఎన్ పీఏ)లను తగ్గించాలి. ఆ దిశలో కొంత కృషి జరిగిన మాట నిజమే కానీ మరింత పకడ్బందీగా వ్యవహరించవలసి ఉంది. 2018 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా జీఎన్ పీఏ నిష్పత్తి 11.2 శాతానికి చేరింది. క్రమంగా తగ్గుతూ 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.58 శాతానికి వచ్చింది. బ్యాంకులు అనుసరిస్తున్న మెరుగైన రుణ మదింపు, కఠిన మైన నియంత్రణ పర్యవేక్షణతోటు దేశవ్యాప్తంగా తయారీ, సేవల రంగాల్లో వృద్ధి నమో దవుతుండటంతో ఈ పురోగతి సాధ్యమైంది.
ప్రతిసారీ బ్యాలెన్స్ షీట్లను క్లియర్ చేయ డానికి రుణాల రైట్–ఆఫ్ బ్యాంకులకు ఒక సాధనమైంది. అయితే అధిక మొత్తంలో రుణ మాఫీలు సరికాదు. ఇవి జీఎన్ పీఏ గణాంకాలను తగ్గించి, మూలధన వినియోగాన్ని నియంత్రించేలా చేస్తాయి. కస్టమర్లు తీసుకున్న రుణాల్లో బలమైన రికవరీ (వసూలు) లేక పోతే బ్యాంకులు శాశ్వత నష్టాల్లో కూరుకుపో తాయి. దేశంలో నిరర్థక ఆస్తుల రికవరీ ఏటా 10 నుంచి 15% వరకు ఉంటోంది. దానికి తోడు ఏటా కొత్తగా ఎన్ పీఏలు చేరుతున్నాయి. ఇది బ్యాంకింగ్ వ్యవస్థకు గొడ్డలిపెట్టు.
ఆర్‌బీఐ డేటా ప్రకారం, రూ.1 లక్ష అంత కంటే ఎక్కువ పరిమాణంలోని ఆర్థిక మోసాల విలువ 2025 ఆర్థిక సంవత్సరంలో 36,013 కోట్లకు చేరింది. ఈ పెరుగుదల క్రెడిట్ అండర్ రైటింగ్ (అప్పు ఇచ్చే ముందు బ్యాంకులు పరి గణించే పరామితులు)లో లోపాలను ప్రతిబింబిస్తోంది. గతంలో కంటే మోసాల సంఖ్య తగ్గినా సగటు మోసం చేసే మొత్తం నగదు విలువ అధికంగా ఉంటోంది.
ఇది వ్యవస్థాగత బలహీనతను సూచిస్తోంది. దీనికితోడు ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (విల్‌ఫుల్ డిఫాల్టర్లు) పెరుగుతున్నారు. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి భారతీయ బ్యాంకులు 1,629 ఉద్దేశపూర్వక ఎగవేతదారులను నివేదించాయి. వీరి మొత్తం రుణం రూ. 1.62 లక్షల కోట్లుగా తెలిపాయి. వీరిపై అనేక సంద ర్భాల్లో చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నా రికవరీ మందకొడిగా ఉంది. ఈ దీర్ఘకాలిక సమస్యను తగ్గించడానికి కఠిన చర్యలు అవసరం.
రియల్ టైమ్ అనలిటిక్స్, ఏఐ ఆధారిత నిఘా, ఆడిట్ ఇంటిగ్రేషన్ ద్వారా పెద్దమొత్తంలో మోసాలను తగ్గించవచ్చు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును రికవరీ చేయడా నికి, భవిష్యత్తులో ఎగవేతలను నిరోధించడా నికి కఠిన చట్టాలు అవసరం. బ్యాంకుల కార్పొరేట్, ఎస్‌ఎంఈ విభాగాల్లో రుణాలు మంజూరు చేసేటపుడు మరింత పకడ్బందీ విధానాలు పాటించాలి.
– అల్లపురపు పవన్ కుమార్