
ఆగష్టు 1వ తేదీ నుంచి యూపీఐ(Unified Payment Interface) యూజర్లకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో.. పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసుకునేవారిని చెక్ పెట్టే నిబంధనలు ప్రధానంగా తీసుకొచ్చింది.
యూపీఐ పేమెంట్స్ చేసేవారు.. ఇక నుంచి రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్‌కు NPCI వీలు కల్పించనుంది. అలాగే.. ఫోన్ నెంబర్ లింకైన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25సార్లు మాత్రమే చూసేలా నిబంధన తీసుకురానుంది. పదే పదే బ్యాలెన్స్ చెక్‌తో ఏర్పడే ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకే ఈ రూల్స్ తెచ్చినట్లు తెలిపింది.
ఇక.. ఆటోపే ట్రాన్‌జాక్షన్ విషయంలోనూ ఓ చిన్న మార్పు చేసింది. UPI AutoPay లావాదేవీలకు నిర్దిష్ట సమయ పరిమితులు (ఫిక్స్‌డ్ టైం స్లాట్) ఆప్షన్ తీసుకొచ్చింది. అంటే.. సబ్‌స్క్రిప్షన్లు, విద్యుత్/నీటి బిల్లులు, ఈఎంఐలాంటి షెడ్యూల్ చేయబడిన చెల్లింపులు ఇకపై ఫలానా రోజులో మొత్తం ఎప్పుడైనా జరగకుండా.. ముందుగా నిర్ణయించిన టైం స్లాట్ ప్రకారం ప్రాసెస్ అవుతాయి.
అయితే ట్రాన్‌జాక్షన్(లావాదేవీల) లిమిట్ విషయంలో యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.