
రూ.300లోపు వాటికి అమలు చేయాలి
మల్టిప్లెక్స్ అసోసియేషన్ డిమాండ్
న్యూఢిల్లీ: సినిమా టికెట్ల ధర రూ.300లోపు వాటిని 5 శాతం జీఎస్‌టీ కిందకు తీసుకురావాలని సినిమా, మల్టిప్లెక్స్ ఆపరేటర్లు కేంద్రాన్ని కోరారు. దీనివల్ల సినిమా ప్రదర్శనలు సామాన్యులకు అందుబాటులో ఉండడమే కాకుండా.. కరోనా తర్వాత నుంచి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న, సినిమా ప్రదర్శకులకు సాయంగా నిలుస్తుందని మల్టిప్లెక్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) పేర్కొంది.
‘‘ప్రస్తుత జీఎస్‌టీ చట్టంలో రూ.100కు మించిన సినిమా టికెట్లను 18 శాతం శ్లాబు పరిధిలో ఉంచగా, రూ.100లోపు టికెట్లపై 12 శాతం జీఎస్‌టీ అమలవుతోంది. రూ.100 పరిమితిని రూ.300కు పెంచాలని కోరుతున్నాం. దీంతో రూ.300 వరకూ ఉన్న టికెట్లపై 5 శాతం జీఎస్‌టీ, అంతకుమించిన ధరలపై 18 శాతం జీఎస్‌టీ అమలు చేయాలి’’అని ఎంఏఐ ప్రెసిడెంట్ కమల్ జ్ఞన్‌చందాని పేర్కొన్నారు.
రూ.100 పరిమితి ఏడేళ్లుగా అమల్లో ఉందంటూ.. దీన్ని రూ.300కు పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ, ఐఅండ్‌బీ శాఖను కోరినట్టు చెప్పారు. పరిశ్రమ మనుగడకు, వృద్ధికి మద్దతుగా రూ.300 వరకు ధరలున్న మూవీ టికెట్లపై తక్కువ రేటు విధించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. తమ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించినట్టయితే అప్పుడు రూ.300 వరకు టికెట్లపై రూ.20–25 వరకు ధర తగ్గుతుందన్నారు.
సినిమా థియేటర్లలో విక్రయించే ఆహారం, పానీయాలను రెస్టారెంట్ సేవలుగా పరిగణిస్తూ.. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయం కల్పించడం లేదన్నారు. దీంతో ఈ సేవలకు గాను తాము చేసిన కొనుగోళ్లపై చెల్లించిన పన్నును సర్దుబాటు చేసుకునే అవకాశం ఉండడం లేదన్నారు. కనుక ఐటీసీ ప్రయోజనం కల్పించాలని కోరారు. 9,000 స్క్రీన్లకు ఎంఏఐ ప్రాతినిధ్యం వహిస్తోంది.