అదరగొట్టిన మారుతి:అమ్మకాల జోష్‌ మామూలుగా లేదుగా!

Maruti Suzuki Q3 Net profit more than doubled revenue up by 25pc - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి  క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. నికర లాభం రెట్టింపు కంటే ఎక్కువలాభాలను నమోదు చేసింది. అలాగే ఆదాయం కూడా 25 శాతం ఎగిసింది.  EBIT మార్జిన్ కూడా 350 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 7.6 శాతానికి చేరుకుంది. లాభాల మార్జిన్ 380 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 8.4 శాతంగా ఉంది.

ప్యాసింజర్, హై ఎండ్‌  కార్ల బలమైన డిమాండ్, ఇటీవలి కాలంలో ధరల పెంపు నేపథ్యంలో మారుతీ గణనీయ లాభాలను సాధించింది. త్రైమాసిక ఏకీకృత నికర లాభంలో ఊహించిన దానికంటే మెరుగ్గా 129.55 శాతం జంప్‌ చేసింది. గత ఏడాదితో రూ.1,041.8 కోట్లతో పోలిస్తే, రూ.2,391.5 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 29,057.5 కోట్లను సాధించింది. గత  ఏడాది  23,253.3 కోట్ల వార్షిక ప్రాతిపదికన 24.96 శాతం పెరిగింది. జోరందుకున్న అమ్మకాలు, ముడి సరుకు ధర తగ్గడంతో లాభాల్లో పెరుగుదల నమోదైందని కంపెనీ తెలిపింది. 

ఈ త్రైమాసికంలో  మొత్తం 465,911 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 430,668 యూనిట్లు విక్రయించింది. దేశీయ అమ్మకాలు 403,929 యూనిట్లు  కాగా, ఎగుమతులు 61,982 యూనిట్లు. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఈ త్రైమాసికంలో సుమారు 46,000 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపింది. ఇది మొత్తం 430,668 యూనిట్ల విక్రయాలకు వ్యతిరేకంగా ఉంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో దేశీయంగా 365,673 యూనిట్లు , ఎగుమతి మార్కెట్లలో 64,995 యూనిట్లు ఉన్నాయని మారుతి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.27,849.2 కోట్ల నికర విక్రయాలను నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో నికర విక్రయాలు రూ.22,187.6 కోట్లుగా ఉన్నాయి. అలాగే మారుతీ సుజుకి 2022 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో అత్యధికంగా రూ. 81,679 కోట్ల నికర అమ్మకాలను నమోదు చేసింది, ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 58,284.1 కోట్లుగా ఉంది. ఎఫ్‌వై22 మొదటి తొమ్మిది నెలల్లో రూ.1,927.4 కోట్ల నుంచి ఏడాది మొదటి తొమ్మిది నెలల నికర లాభం రూ.5,425.6 కోట్లకు పెరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top