మేక్‌మైట్రిప్ కొత్త అప్డేట్.. వాయిస్‌తోనే బుకింగ్! | MakeMyTrip Upgrades AI Assistant Myra 2.0 | Sakshi
Sakshi News home page

మేక్‌మైట్రిప్ కొత్త అప్డేట్.. వాయిస్‌తోనే బుకింగ్!

May 15 2026 5:59 PM | Updated on May 15 2026 6:12 PM

MakeMyTrip Upgrades AI Assistant Myra 2.0

భారతదేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ మేక్‌మైట్రిప్ తన ఏఐ బేస్డ్ ట్రావెల్ అసిస్టెంట్ ‘మైరా’లో కొత్త అప్‌గ్రేడ్‌ను ప్రవేశపెట్టింది. ఈ అప్‌డేట్ ముఖ్య ఉద్దేశ్యం.. వినియోగదారుల బుకింగ్ ప్రక్రియను పూర్తిగా సులభతరం చేసి, సెర్చింగ్ నుంచి చెల్లింపు వరకు మొత్తం ఒకే ఇంటర్‌ఫేస్‌లో పూర్తి చేయగలిగేలా చేయడం. అవసరమైతే వాయిస్ ఆధారిత విధానంలో కూడా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.

'మైరా 2.0' ఇప్పుడు సాధారణ సెర్చ్‌లను మాత్రమే కాకుండా, చాలా అవసరాలకు ఉపయోగపడుతుంది. క్లిష్టమైన ప్రయాణ అభ్యర్థనలను కూడా అర్థం చేసుకుని పరిష్కారం చూపుతుంది. ఉదాహరణకు.. కుటుంబ ప్రయాణాల కోసం ప్రత్యేక అవసరాలు ఉన్న హోటల్స్, వృద్ధుల కోసం సౌకర్యాలు లేదా వీసా సంబంధిత సమాచారం వంటి అంశాలను ఒకే చోట అందిస్తుంది. దీంతో వినియోగదారులు అనేక వెబ్‌సైట్లను పరిశీలించాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదికపై పూర్తి సమాచారం పొందగలుగుతారు.

ఈ కొత్త వెర్షన్‌లో.. వాయిస్ సపోర్ట్ కూడా ఉంది. తెలుగు సహా ఎనిమిది భాషల్లో.. వాయిస్ ద్వారా సెర్చ్, ఎంపికలు, బుకింగ్ వంటివి పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాయిస్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల, ఈ ఫీచర్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా.. వినియోగదారులు తమ పాస్‌పోర్ట్ లేదా ఇతర డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తే, వాటి వివరాలను ఆటోమేటిక్‌గా గుర్తించి బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

మరో ముఖ్యమైన డెవలప్మెంట్ ఏమిటంటే.. చెల్లింపు ప్రక్రియను కూడా సంభాషణలోనే పూర్తి చేయగలగడం. వినియోగదారులు సెర్చ్ చేయడం, ఎంపిక చేయడం, కన్ఫర్మ్ చేయడం,పేమెంట్ చేయడం వరకు అన్ని దశలను ఒకే ఇంటర్‌ఫేస్‌లో పూర్తి చేయవచ్చు. అదేవిధంగా, బుకింగ్ మధ్యలో కూడా వినియోగదారులు ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు, దీంతో ప్రక్రియ మధ్యలో ఆగిపోకుండా కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement