మార్చిలో ఎల్‌ఐసీ ఐపీవో

LIC IPO Prospectus To Be Filed Next Week, Issue In March - Sakshi

వచ్చే వారం ప్రాస్పెక్టస్‌ దాఖలు

‘దీపం’ కార్యదర్శి పాండే వెల్లడి

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ మార్చిలో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను వచ్చే వారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనుంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఈ విషయాలు వెల్లడించారు.

బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నారని, అవి వచ్చాక షేర్ల విక్రయం తదితర అంశాలతో కూడిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేస్తారని పేర్కొన్నారు. సెబీ అనుమతులు కూడా వచ్చాక మార్చిలో లిస్టింగ్‌ ఇష్యూకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పాండే వివరించారు. ‘ఐఆ ర్‌డీఏఐ అనుమతులు వచ్చిన 7–10 రోజుల్లోగా ఎల్‌ఐసీ ఐపీవోకి సంబంధించి ప్రాస్పెక్టస్‌ దాఖలు అవుతుంది. సెబీతో ఇప్పటికే వివిధ అంశాలపై చర్చిస్తున్నాం.

ఇష్యూ పరిమాణం తదితర అంశాలన్నీ డీఆర్‌హెచ్‌పీలో ఉంటాయి. ఐఆర్‌ఎఫ్‌సీ, రైల్‌టెల్‌ తరహాలోనే ఐపీవోలో కొంత భాగం యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇష్యూలో సుమారు 10 శాతాన్ని పాలసీదారుల కోసం కేటాయించనున్నారు. ఎల్‌ఐసీ మెగా ఐపీవో నిర్వహణ కోసం గోల్డ్‌మన్‌ శాక్స్‌ (ఇండియా) సెక్యూరిటీస్, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా తదితర 10 మర్చంట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు ఎంపికయ్యాయి. ఎల్‌ఐసీ ఇష్యూ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ గతేడాది జూలైలో ఆమోదముద్ర వేసింది.
 
ఎఫ్‌డీఐ పాలసీకి మార్పులు..: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకి సంబంధించి ఆర్థిక శాఖ అభిప్రాయాల మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానానికి తగు మార్పులు చేస్తున్నట్లు పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ తెలిపారు. సవరణలకు కేంద్ర కేబినెట్‌ త్వరలో ఆమోదముద్ర వేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సెబీ నిబంధనల ప్రకారం సాధారణంగా కంపెనీల  పబ్లిక్‌ ఇష్యూల్లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) షేర్లను కొనుగోలు చేయవచ్చు. కాకపోతే ఎల్‌ఐసీది కార్పొరేషన్‌ హోదా కావడంతో ఎఫ్‌పీఐలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు షేర్లను కొనుగోలు చేసేందుకు ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించాల్సి ఉంటుందని జైన్‌ వివరించారు.

టాప్‌ 3 బీమా బ్రాండ్‌గా ఎల్‌ఐసీ
ఎల్‌ఐసీ గతేడాది దాదాపు 8.656 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 64,722 కోట్లు) బ్రాండ్‌ వేల్యుయేషన్‌తో పటిష్టమైన బీమా బ్రాండ్‌ల కేటగిరీలో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిల్చింది. అలాగే బీమా రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలు కలిపి.. అత్యంత విలువైన బ్రాండ్‌లలో 10వ స్థానం దక్కించుకుంది. లండన్‌కి చెందిన  బ్రాండ్‌ ఫైనాన్స్‌ నివేదిక ప్రకారం 2021లో అంతర్జాతీయంగా టాప్‌ 100 బీమా సంస్థల విలువ 6% క్షీణించింది. అయితే, ఎల్‌ఐసీ బ్రాండ్‌ విలువ మాత్రం 2020తో పోలిస్తే 6.8% పెరిగి, దేశంలోనే అత్యంత పటిష్టమైన, అతి పెద్ద బ్రాండ్‌గా మారింది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో 238వ స్థానం నుంచి 32 స్థానాలు ఎగబాకి 206వ ర్యాంకుకు చేరింది. బ్రాండ్‌ ఫైనాన్స్‌ ప్రకారం 2022లో ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ 2022లో 59.21 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 43.40 లక్షల కోట్లు), 2027 నాటికి 78.63 బిలియన్‌ డాలర్లకు (రూ. 58.9 లక్షల కోట్లు) చేరవచ్చని అంచనా. బీమా బ్రాండ్లలో చైనాకు చెందిన పింగ్‌ యాన్‌ టాప్‌లో ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top