ఎల్‌ఐసీ ప్రాస్పెక్టస్‌లో క్యూ3 ఫలితాలు అప్‌డేట్‌

LIC IPO: Govt files updated draft papers with Q3 financials - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తమ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తాజా క్యూ3 ఫలితాలతో అప్‌డేట్‌ చేసింది. సదరు పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. సెబీ నిబంధనల ప్రకారం డిసెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలతో అప్‌డేట్‌ చేసిన ప్రాస్పెక్టస్‌ను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో ఎల్‌ఐసీ నికర లాభం రూ. 235 కోట్లుగా ఉంది.

అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో నమోదైన రూ. 7.08 కోట్లతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో లాభం రూ. 1,672 కోట్లకు పెరిగింది. ప్రతిపాదిత ఐపీవో కింద 5 శాతం వాటాల (31.6 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా సుమారు రూ. 60,000 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ. 78,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటిదాకా కేవలం రూ. 12,423 కోట్లు మాత్రమే సేకరించగలిగింది.

మిగతా మొత్తాన్ని ఎల్‌ఐసీ ఐపీవో ద్వారా భర్తీ చేసుకోవచ్చని భావించింది. ఇందుకోసం మార్చిలోనే పబ్లిక్‌ ఇష్యూ కోసం సన్నాహాలు చేసుకున్నప్పటికీ రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల కారణంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సెబీకి కొత్తగా మరోసారి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం తీసుకున్న అనుమతులతో పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లేందుకు ప్రభుత్వానికి మే 12 వరకూ గడువు ఉంది.

అతి పెద్ద ఐపీవో..: అంతా సజావుగా జరిగితే భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద ఐపీవో కానుంది. ఒక్కసారి లిస్టయ్యిందంటే ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ.. రిలయన్స్, టీసీఎస్‌ వంటి దిగ్గజాలను కూడా మించిపోనుంది. ఇప్పటిదాకా అత్యంత భారీ ఐపీవో రికార్డు.. పేటీఎం పేరిట ఉంది. 2021లో పేటీఎం రూ. 18,300 కోట్లు సమీకరించింది. ఆ తర్వాత స్థానాల్లో కోల్‌ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్‌ పవర్‌ (2008లో రూ. 11,700 కోట్లు) ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top