మెగా ఐపీవోకి ఎల్‌ఐసీ రెడీ

LIC files DRHP with SEBI for mega IPO - Sakshi

సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌

5% ప్రభుత్వ వాటా అమ్మకం 

రూ. 63 వేల కోట్ల సమీకరణ!

వేల్యుయేషన్‌ రూ. 5.4 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రతిపాదిత మెగా పబ్లిక్‌ ఇష్యూ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందుకు సంబంధించి.. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే .. మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ఈ విషయం తెలిపారు. దాదాపు 5% వాటాకి సరిసమానమైన 31.63 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నట్లు వివరించారు.

ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 63,000 కోట్లు సమీకరించవచ్చని మర్చంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు వెల్లడించాయి. ముసాయిదా ప్రాస్పెక్టస్‌ ప్రకారం ..ఐపీవోలో కొంత భాగాన్ని అర్హత కలిగిన ఉద్యోగులు, పాలసీదారులకు కేటాయించనున్నారు. పబ్లిక్‌ ఇష్యూలో ఉద్యోగులకు కేటాయించే వాటా గరిష్టంగా 5%, పాలసీదారులకు 10%గా ఉంటుంది. నిర్దిష్ట మదింపు విధానం కింద 2021 సెప్టెంబర్‌ 30 ఆఖరు నాటికి ఎల్‌ఐసీ విలువ సుమారు రూ. 5.4 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంతర్జాతీయ యాక్చువేరియల్‌ సంస్థ మిల్లిమన్‌ అడ్వైజర్స్‌ లెక్క వేసింది.

ఐపీవో ద్వారా వచ్చే నిధులు మొత్తం ప్రభుత్వానికే వెడతాయి.  పూర్తిగా ప్రభుత్వ షేర్లనే విక్రయిస్తుండటంతో ఈ ఐపీవో 100% ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపం లో ఉండనుంది. ఎల్‌ఐసీ కొత్తగా షేర్లను జారీ చేయదు. ‘2021 మార్చి ఆఖరు నాటి గణాంకాల ప్రకారం కొత్త ప్రీమియంల విషయంలో ఎల్‌ఐసీకి 66% మార్కెట్‌ వాటా ఉంది. అలాగే 28.3 కోట్ల పాలసీలు, 13.5 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు‘ అని పాండే పేర్కొన్నారు. అయితే, ఎల్‌ఐసీ మార్కె ట్‌ వేల్యుయేషన్‌ గురించి గానీ పాలసీదారులు లేదా ఎల్‌ఐసీ ఉద్యోగులకు గానీ ఎంత డిస్కౌంట్‌ ఇచ్చేదీ ప్రాస్పెక్టస్‌లో  వెల్లడించలేదు.

భారీ మార్కెట్‌ వాటా ..
ప్రస్తుతం దేశీయంగా 24 జీవిత బీమా కంపెనీలు ఉండగా ప్రభుత్వ రంగంలో ఎల్‌ఐసీ ఒక్కటే ఉంది. అదే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్కసారి లిస్టయ్యిందంటే, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌పరంగా ఎల్‌ఐసీ దేశంలోనే అతి పెద్ద కంపెనీగా ఆవిర్భవిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఎల్‌ఐసీ లాభం రూ. 1,437 కోట్లుగా నమోదైంది. రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనాల ప్రకారం..  2020 గణాంకాలు బట్టి దేశీయంగా మొత్తం స్థూల ప్రీమియంలలో 64.1 శాతం వాటాతో ఎల్‌ఐసీ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఉంది. ఈ వాటాల విలువ 56.405 బిలియన్‌ డాలర్లుగా ఉంటుంది.

తద్వారా ప్రీమియంలపరంగా ఎల్‌ఐసీ .. అంతర్జాతీయంగా టాప్‌ జీవిత బీమా సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఉన్న ఎస్‌బీఐ లైఫ్‌కి 8 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఇలా మొదటి, రెండో స్థానాల్లోని కంపెనీల మార్కెట్‌ వాటాల్లో ఇంత భారీ వ్యత్యాసం ప్రపంచంలో ఎక్కడా లేదని క్రిసిల్‌ తెలిపింది. చైనా మార్కెట్‌కు సంబంధించి పింగ్‌ యాన్‌ ఇన్సూరెన్స్‌కు అక్కడ అత్యధికంగా 21 శాతం, రెండో స్థానంలోని చైనా లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు 20 శాతం వాటా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ప్రాతిపదికన భారత జీవిత బీమా పరిశ్రమ విలువ రూ. 5.7 లక్షల కోట్ల నుంచి రూ. 6.2 లక్షల కోట్లకు చేరింది.

మార్చిలో ఇష్యూకి అవకాశం ..
ఎల్‌ఐసీ ఐపీవోకు  గతేడాది జూలైలోనే ఆమోదముద్ర వేసింది. షేర్‌ క్యాపిటల్‌ను రూ. 100 కోట్ల నుంచి రూ. 6,325 కోట్లకు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్‌ఐసీ ఐపీవోని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న నేపథ్యంలో పబ్లిక్‌ ఇష్యూ మార్చిలో ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 78,000 కోట్ల నిధులు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటిదాకా ఎయిరిండియాలో విక్రయం, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 12,030 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం వాటాలు (632,49,97,701 షేర్లు) ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top