
లూనా తర్వాత కైనెటిక్ నుంచి మరో ఐకానిక్ బండి తిరిగి కొత్తగా మార్కెట్లోకి వస్తోంది. కైనెటిక్ డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్లో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ .1.12 లక్షల నుంచి రూ.1.18 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ స్కూటర్ డీఎక్స్, డిఎక్స్+ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 116 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ డీఎక్స్ స్కూటర్కు కైనెటిక్ గ్రీన్ మూడు సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీని అందిస్తోంది. దీంతోపాటు తొమ్మిది సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీ ఎంచుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. వైట్, బ్లూ, బ్లాక్, సిల్వర్, రెడ్ రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటు ఉంటుంది.
జూలై 28 నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుక్కోవాలనుకుంటున్నవారు రూ .1,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఈవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2025 అక్టోబర్లో డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే డెలివరీలను 40,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కైనెటిక్ గ్రీన్ వెల్లడించింది.
ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన లూనాతో పాటు కైనెటిక్ తన బ్రాండ్ కింద రెండవ ఐకానిక్ నేమ్ ప్లేట్ ను పునరుద్ధరించింది. భారత్కు చెందిన కైనెటిక్ ఇంజనీరింగ్, జపాన్ కు చెందిన హోండా మోటార్ కంపెనీ సంయుక్త భాగస్వామ్యంలో 1984 నుండి 2007 మధ్య కైనెటిక్ డీఎక్స్ స్కూటర్లు ఉత్పత్తి అయ్యాయి. హోండా ఎన్హెచ్ సిరీస్ స్కూటర్ల కింద రూపొందిన ఆ స్కూటర్ 98 సీసీ టూ-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇప్పుడిది ఎలక్ట్రిక్ మోడల్గా తిరిగి రోడ్డెక్కుతోంది.