జియో.. పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌ | Sakshi
Sakshi News home page

జియో.. పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌

Published Wed, Sep 23 2020 4:30 AM

Jio Launch Postpaid Plus Services In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్‌ టారిఫ్‌లు, బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో ధరల యుద్ధానికి తెరలేపి సంచలనం సృష్టించిన రిలయన్స్‌కు చెందిన టెలికం సంస్థ జియో.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకు కేవలం రూ.199 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌కు పరిమితమైన ఈ కంపెనీ కొత్తగా పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌ పేరుతో నూతన సేవలను మంగళవారం ప్రకటించింది. నెల టారిఫ్‌ రూ.399తో మొదలుకుని రూ.1,499 వరకు ఉంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్‌ ఎంజాయ్‌ చేయవచ్చు. ఫ్యామిలీ ప్లాన్, డేటా రోల్‌ఓవర్‌ ఆకర్షణీయ ఫీచర్లుగా నిలవనున్నాయి. విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు తొలిసారిగా ఇన్‌ఫ్లైట్‌ కనెక్టివిటీ ప్రవేశపెట్టారు. కస్టమర్‌ కోరితే ఇంటి వద్దకే వచ్చి సర్వీస్‌ యాక్టివేట్‌ చేస్తారు. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో 40 కోట్ల మంది కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నామని జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రతి పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సేవలను పరిచయం చేశామన్నారు. 

పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌ విశేషాలు.. 
ఇంటర్నేషనల్‌ కాలింగ్‌ చార్జీ నిముషానికి 50 పైసల నుంచి ప్రారంభం. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వైఫై కాలింగ్‌ ద్వారా భారత్‌కు నిముషానికి రూపాయికే కాల్‌ చేయవచ్చు. డేటా రోల్‌ఓవర్‌ పేరుతో అదనంగా డేటాను ఆఫర్‌ చేస్తోంది. దీని కింద ఇచ్చినదాంట్లో మిగిలిపోయిన డేటానే తదుపరి నెలకు జమ అవుతుంది. అపరిమిత వాయిస్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ చేసుకోవచ్చు. ప్యాక్‌నిబట్టి ఫ్యామిలీ ప్లాన్‌ కింద అదనపు కనెక్షన్లు పొందవచ్చు. ఇలా అదనంగా కనెక్షన్‌ తీసుకున్న  కుటుంబ సభ్యులు ప్యాక్‌ కింద వచ్చిన డేటాను వాడుకోవచ్చు. 

ఇవీ నూతన టారిఫ్‌లు..: రూ.399 ప్యాక్‌లో 75 జీబీ డేటా లిమిట్‌ ఉంది. అలాగే డేటా రోల్‌ఓవర్‌ కింద 200 జీబీ ఇస్తారు. 100 జీబీ డేటాతో కూడిన రూ.599 ప్యాక్‌లో డేటా రోల్‌ఓవర్‌ 200 జీబీ, ఫ్యామిలీ ప్లాన్‌ కింద ఒక సిమ్‌ అదనం. రూ.799 ప్యాక్‌లో 150 జీబీ డేటా, 200 జీబీ డేటా రోల్‌ఓవర్, ఫ్యామిలీ ప్లాన్‌లో 2 అదనపు సిమ్‌లు పొందవచ్చు. రూ.999 ప్యాక్‌లో 200 జీబీ డేటా, 500 జీబీ డేటా రోల్‌ఓవర్, 3 అదనపు సిమ్‌లు  లభిస్తాయి. రూ.1,499 టారిఫ్‌లో 300 జీబీ డేటా, 500 జీబీ డేటా రోల్‌ఓవర్‌తోపాటు యూఎస్‌ఏ, యూఏఈలో అన్‌లిమిటెడ్‌ డేటా, వాయిస్‌ ఆఫర్‌ చేస్తున్నారు. 

Advertisement
Advertisement