
రిలయన్స్ జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఏప్రిల్ 2025కిగాను ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో జియో వైర్‌లెస్ మొబిలిటీ, వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్, 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) విభాగాల్లో సబ్‌స్క్రైబర్ల వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది.
అత్యంత పోటీ ఉన్న వైర్‌లెస్(మొబైల్) విభాగంలో అత్యధిక నెట్ సబ్‌స్క్రైబర్లను జోడించి టాప్‌లో నిలిచింది. మొత్తంగా ఏప్రిల్‌లో జియో 95,310 కొత్త సబ్‌స్క్రైబర్లను జోడించి, మార్చిలో 3,17,76,074 ఉన్న వినియోగదారులను 3,18,71,384కు పెంచుకుంది. ఎయిర్‌టెల్ 42,600 సబ్‌స్క్రైబర్లను పెంచుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్ 1,715 సబ్‌స్క్రైబర్ల సాధారణ వృద్ధిని చూపింది. కాగా వోడాఫోన్ ఐడియా 9,058 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది.
ఇదీ చదవండి: క్రిప్టో విధానాలపై త్వరలో చర్చా పత్రం
జియో ఫైబర్
రిలయన్స్ జియో వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్, జియో ఫైబర్, ఏపీ టెలికాం సర్కిల్‌లో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఏప్రిల్‌లో జియో ఫైబర్ 54,000కి పైగా కొత్త సబ్‌స్క్రైబర్లను జోడించింది. దాంతో మొత్తం వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ బేస్‌ను సుమారు 1.66 మిలియన్లకు విస్తరించింది. ఈ వృద్ధి రేటు ఎయిర్‌టెల్ (సుమారు 18,000 సబ్‌స్క్రైబర్లు), బీఎస్‌ఎన్‌ఎల్ కంటే ఎక్కువ. జియో ఎయిర్‌ఫైబర్ తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ లీడర్‌గా నిలిచింది. ఏప్రిల్ 2025 నాటికి జియో ఎయిర్‌ఫైబర్ దేశవ్యాప్తంగా 6.14 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. ఏపీ సర్కిల్‌లో జియో ఎయిర్‌ఫైబర్ సబ్‌స్క్రైబర్ బేస్ జనవరి 2025లో 4,27,439 నుంచి ఏప్రిల్‌లో 5,23,000కి పెరిగింది. ఈ విభాగంలో 80%కి పైగా మార్కెట్ షేర్‌ను దక్కించుకుంది.