జియో, ఎయిర్‌టెల్‌ ఓకే.. వీఐఎల్‌పైనే సందేహం..

 Jio, Airtel in position to buy pan-India spectrum, VIL bid unclear - Sakshi

దేశవ్యాప్త 5జీ స్పెక్ట్రం బిడ్డింగ్‌పై నివేదిక

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా సర్కిల్స్‌లో 5జీ స్పెక్ట్రంను కొనుగోలు చేసే సామర్థ్యాలు ఉన్నాయని బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌ ఒక నివేదికలో తెలిపింది. అయితే, ఆర్థిక సమస్యల్లో ఉన్న వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) కూడా బిడ్డింగ్‌లో పాల్గొనడంపైనే అనిశ్చితి నెలకొందని పేర్కొంది. ఇప్పటికే 4జీ బ్యాండ్‌లన్నీ పూర్తి స్థాయిలో వినియోగంలో ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్తగా స్పెక్ట్రం తీసుకోకుండా ప్రస్తుత 4జీ బ్యాండ్‌పైనే నిర్దిష్ట సర్కిళ్లలో 5జీ సేవలు అందించడం కష్టసాధ్యంగా ఉంటుందని వివరించింది.

‘స్పెక్ట్రంకు భారీగా ధర నిర్ణయించడంతో కొత్త టెల్కోలు వేలంలో పాల్గొనే అవకాశాలు తక్కువ. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రమే దేశవ్యాప్తంగా 5జీ స్పెక్ట్రంను కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్నాయి. 5జీ బిడ్డింగ్‌ కోసం వీఐఎల్‌ నిధులను ఎలా సమకూర్చుకోగలుగుతుందనే అంశంపై స్పష్ట,త లేదు‘ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో కీలకమైన కొన్ని సర్కిళ్లపైనే వీఐఎల్‌ దృష్టి పెట్టవచ్చని, తమకు ప్రధానమైన 3జీ, 4జీ సర్కిల్స్‌లో మాత్రమే బిడ్‌ చేయొచ్చని తెలిపింది. అయితే, దేశవ్యాప్తంగా 5జీ స్పెక్ట్రం లేకపోతే వీఐఎల్‌ మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.  

1 లక్ష మెగాహెట్జ్‌ స్పెక్ట్రంను రూ. 7.5 లక్షల కోట్ల రిజర్వ్‌ ధరతో (30 ఏళ్లకు కేటాయిస్తే) వేలం వేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సిఫార్సు చేసింది.     ఈ  ఏడాది జూన్‌ ఆఖర్లో లేదా జూలై తొలినాళ్లలో వేలం నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆగస్టు–సెప్టెంబర్‌ నాటికి 5జీ సేవలు రావచ్చని అంచనా. స్పెక్ట్రం వేలం ప్రతిపాదనను కేంద్ర టెలికం శాఖ ఈ వారంలో కేంద్ర క్యాబినెట్‌ తుది ఆమోదముద్ర కోసం పంపనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top