ఉద్యోగులను ఆఫీస్‌కి రప్పించడానికి.. మరో ఎత్తు వేసిన ఇన్ఫోసిస్‌!

Infosys work from office mandate rolls out In Person Collab Weeks - Sakshi

దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి మరో ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ENG-IoT) ప్రాజెక్ట్‌లలో పనిచేసే ఉద్యోగులకు 'ఇన్-పర్సన్ కొల్లాబ్ వీక్స్'ని అమలు చేస్తోంది. 

తాము సమీక్షించిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల ఈమెయిల్స్‌ ఉటంకిస్తూ ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఈమేరకు పేర్కొంది. వీటి ప్రకారం.. తమకు కేటాయించిన వారాల్లో ఉద్యోగులు వారి సంబంధిత క్యాంపస్‌లలో హాజరు కావాలి. ఆఫీస్‌ నుంచి పనిచేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి త్రైమాసికంలో ఉద్యోగులకు నిర్దిష్ట వారాలను నిర్దేశిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం, ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు లేదా త్రైమాసికానికి 30 రోజులు ఆఫీస్‌ నుంచి పని చేయాలి.

ఈ హైబ్రిడ్ వర్క్ అప్రోచ్ ద్వారా టీమ్ వర్క్, ఉత్పాదకతను పెంపొందించడం ఇన్ఫోసిస్ లక్ష్యం. బేస్ లొకేషన్‌లకు దూరంగా ఉన్న ఉద్యోగులు ఈ వారాల్లో డెవలప్‌మెంట్‌ సెంటర్లకు తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని కంపెనీ కోరింది. కొల్లాబ్ వీక్స్‌లో పాల్గొనే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా నిర్ణయించలేదని, ప్రతి త్రైమాసికానికి కనీసం ఆరు వారాలు ఆఫీస్‌ నుంచి పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానాన్ని ఈ త్రైమాసికం నుంచి అమలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ నిర్దేశిత వారాలలో ఆఫీస్‌ నుంచి పనిచేసే ఉద్యోగులకు వారికి అనువైన రోజులను ఎంచుకోవడంలో సౌలభ్యాన్ని కంపెనీ అందిస్తోంది. 10 రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, క్యాంపస్ హాజరును పెంచాలని ఇన్ఫోసిస్ చూస్తోంది.

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top