ఇన్ఫోసిస్‌.. ఓకే

Infosys posts 7percent fall in net profit at Rs 6,128 crore for Q4 - Sakshi

క్యూ4 నికర లాభం రూ. 6,128 కోట్లు

ఈ ఏడాదికి 4–7 శాతం వృద్ధి అంచనా

పూర్తి ఏడాది లాభం 24,095 కోట్లు

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో అంచనాలకంటే దిగువన ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం వార్షికంగా 8 శాతం ఎగసింది. రూ. 6,128 కోట్లను తాకింది. త్రైమాసికవారీ(క్యూ3)గా చూస్తే ఇది 7 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 5,686 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 37,441 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆదాయం 4–7 శాతం స్థాయిలో పుంజుకోగలదని తాజా అంచనాలు(గైడెన్స్‌) ప్రకటించింది. వెరసి ఐటీ సేవలకు నంబర్‌ టూ ర్యాంకులో ఉన్న కంపెనీ 2019 తదుపరి మళ్లీ నెమ్మదించిన గైడెన్స్‌ను వెలువరించింది. ఈ ఏడాది 20–22 శాతం స్థాయిలో నిర్వహణ లాభ మార్జిన్లు సాధించే వీలున్నట్లు పేర్కొంది.

పూర్తి ఏడాదికి
మార్చితో ముగిసిన గతేడాదికి ఇన్ఫోసిస్‌ నికర లాభం 9 శాతం బలపడి రూ. 24,095 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 1,46,767 కోట్లకు చేరింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3) ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ గతేడాది ఆదాయంలో 16–16.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. వెరసి అంతక్రితం ప్రకటించిన 15–16 శాతం గైడెన్స్‌ను మెరుగుపరచింది.

క్యూ4లో ఉత్తర అమెరికా నుంచి 61 శాతం ఆదాయం లభించగా.. యూరోపియన్‌ ప్రాంతం నుంచి 27 శాతం సమకూరింది. కాగా.. క్యూ4లో ఆర్జించిన పటిష్ట ఫ్రీక్యాష్‌ ఫ్లో నేపథ్యంలో తుది డివిడెండును ప్రకటించినట్లు సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ వెల్లడించారు. పూర్తి ఏడాదికి అంతక్రితం డివిడెండుతో పోలిస్తే 10 శాతం అధికంగా చెల్లించినట్లు పేర్కొన్నారు. మూలధన కేటాయింపుల పాలసీకి అనుగుణంగా మరోసారి షేర్ల బైబ్యాక్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలియజేశారు.  

ఫలితాల్లో హైలైట్స్‌...
► వాటాదారులకు షేరుకి రూ. 17.50 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 34 డివిడెండ్‌ చెల్లించినట్లయ్యింది.
► క్యూ4లో 2.1 బిలియన్‌ డాలర్ల విలువైన డీల్స్‌ కుదుర్చుకుంది. క్యూ3లో 3.3 బిలియన్‌ డాలర్లు, క్యూ2లో 2.7 బిలియన్‌ డాలర్ల చొప్పున పొందింది.  
► గతేడాది మొత్తం 9.8 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టులు సంపాదించింది.
► ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు క్యూ3తో పో లిస్తే 24.3% నుంచి 20.9 శాతానికి దిగివచ్చింది.
► మొత్తం సిబ్బంది సంఖ్య 3,43,234కు చేరింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికరంగా 3,611 మంది ఉద్యోగులు తగ్గారు.

క్లయింట్ల ఆసక్తి...
‘డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్‌ సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టితో 2022–23లో పటిష్ట పనితీరును చూపాం. పరిస్థితులు మారినప్పటికీ కంపెనీ సామర్థ్యం, చౌక వ్యయాలు, సమీకృత అవకాశాలు వంటివి క్లయింట్లను ఆకట్టు కుంటున్నాయి. ఇది భారీ డీల్స్‌కు దారి చూపుతోంది’ అని ఇన్ఫోసిస్‌ సీఈఓ ఎండీ సలీల్‌ పరేఖ్‌ వ్యాఖ్యానించారు.
ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతంపైగా క్షీణించి రూ. 1,389 వద్ద ముగిసింది.

అక్షతకు రూ. 68 కోట్లు
ఇన్ఫోసిస్‌ తాజాగా షేరుకి రూ. 17.5 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. దీంతో కంపెనీలో 3.89 కోట్ల షేర్లుగల బ్రిటిష్‌ ప్రధాని రిషీ సునక్‌ భార్య అక్షత రూ. 68.17 కోట్లు అందుకోనున్నారు. ఇందుకు జూన్‌ 2 రికార్డ్‌ డేట్‌. కంపెనీ ఇప్పటికే రూ. 16.5 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించింది. దీంతో అక్షత మొత్తం రూ. 132 కోట్లకుపైగా డివిడెండ్‌ అందుకోనున్నారు. గురువారం షేరు ధర రూ. 1,389(బీఎస్‌ఈ)తో చూస్తే ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతకు గల వాటా విలువ రూ. 5,400 కోట్లు. కాగా.. 2021–22 ఏడాదిలోనూ డివిడెండ్‌ రూపేణా అక్షత ఇన్ఫోసిస్‌ నుంచి దాదాపు రూ. 121 కోట్లు అందుకోవడం గమనార్హం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top