ఇన్ఫీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ జీతం ఎంత? మరో ఐదేళ్లు సీఎండీగా  

Infosys CEO Salil Parekh was paid rs 71 crore in FY 22 - Sakshi

ఇన్ఫోసిస్‌  సీఈఓ సలీల్‌ పరేఖ్‌ పదవీకాలం మరో  ఐదేళ్లు  పొడిగింపు

 సలీల్‌ వార్షిక వేతనం 88 శాతం జంప్‌

సాక్షి, ముంబై:  దేశీయ రెండవ అతిపెద్ద  ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ జీతం 88 శాతం పెరిగిందట. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఏడాదిలో పరేఖ్‌ వార్షిక వేతనం  రూ. 79.75 కోట్లకు  చేరింది. 2020-21లో రూ. 49.68 కోట్ల నుంచి వేతనం 88 శాతం పెరిగిందని ఎక్స్‌ఛేంజ్‌ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.

గురువారం విడుదల చేసిన కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, వాటాదారుల ఆమోదానికి లోబడి కొత్త ఉపాధి ఒప్పందం జూలై 2 నుండి అమలులోకి వస్తుంది. దీంతో భారతదేశంలో అత్యధిక వేతనం పొందే ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు సలీల్‌ పరేఖ్‌. మరో దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌  సీఈవో రాజేష్ గోపీనాథన్ వార్షిక వేతనం రూ. 25.76 కోట్లు, విప్రో  పారిస్ ఆధారిత సీఈవో వేతనం రూ. 64.34 కోట్లు. హెచ్‌సిఎల్ టెక్ సిఇఓ రూ.32.21 కోట్లు టెక్ మహీంద్రా సీఈవో రూ.22 కోట్ల వేతనం అందుకుంటున్నారు.

అలాగే కంపెనీ సీఎండీగా సలీల్ పరేఖ్‌ పదవీకాలాన్ని మరో  ఐదేళ్లు (మార్చి 2027 వరకు) పొడిగింపునకు ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయించింది. 2018  జనవరి నుంచి పరేఖ్ ఇన్ఫోసిస్ సీఎండీగా ఉన్నారు. ఇన్ఫోసిస్‌కు ముందు  క్యాప్‌జెమినీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్న పరేఖ్‌ 25 సంవత్సరాల పాటు అనేక నాయకత్వ పదవులను నిర్వహించారు.  పరేఖ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్ఫోసిస్ స్టాక్ 183శాతం పెరిగింది.  నీలేకని-పరేఖ్ కాంబోలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 19.7శాతం వృద్ధి రేటును సాధించింది. 

అలాగే ఆరుగురు కీలకమైన మేనేజ్‌మెంట్ సిబ్బందికి 104,000 షేర్లు,88 మంది ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు మరో 375,760 షేర్ల మంజూరుకు ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపింది. కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని ఎలాంటి పారితోషికం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిస్‌లో అత్యధిక వేతనం పొందిన సీనియర్లుగా 37.25 కోట్లతో  సీఓఓ యూబీ ప్రవీణ్ రావు, తరువాత 35.82 కోట్లతో ప్రెసిడెంట్ రవి కుమార్  ఉన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top