భారతీయ స్టార్టప్ రంగం అంటేనే సాహసోపేతమైన ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలు. తాజాగా ఒక స్టార్టప్ ఉద్యోగి చేసిన పని, దానికి తన బాస్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరారీలో ఉన్న వ్యాపారి విజయ్ మాల్యాకు చెందిన ప్రసిద్ధ కింగ్ ఫిషర్ విల్లాను తమ కంపెనీ ఈవెంట్ కోసం అద్దెకు ఇవ్వాలని కోరుతూ ఒక ఉద్యోగి ఏకంగా మాల్యాకే ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?
భారతదేశంలో ‘క్రియేటర్ ఎకానమీ’ని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ‘లూప్’ అనే కొత్త ప్రోడక్ట్‌ను మే 21న లాంచ్ చేసేందుకు ఒక టీమ్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ టీమ్ సభ్యురాలు అనుష్క సింగ్ అనే యువతి, తమ లాంచ్ నైట్ కోసం గోవాలోని ఐకానిక్ కింగ్ ఫిషర్ విల్లా అయితే బాగుంటుందని భావించింది. ఏమాత్రం తటపటాయించకుండా నేరుగా విజయ్ మాల్యాను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేసింది.
‘హాయ్ విజయ్ మాల్యా, నా పేరు అనుష్క సింగ్. మే 21న మేము ‘లూప్’ను లాంచ్ చేస్తున్నాము. ఇందుకోసం 1000 మందికి పైగా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో ఒక భారీ ఈవెంట్ నిర్వహించాలనుకుంటున్నాం. ఒక రాత్రి కోసం మీ కింగ్ ఫిషర్ విల్లాను మాకు అద్దెకు ఇవ్వగలరా? మీరు ఎంత అడిగినా చెల్లించడానికి సిద్ధం. ఒకవేళ అది ఇప్పుడు మీ ఆధ్వర్యంలో లేకపోతే ప్రస్తుతం అది ఎవరి ఆధీనంలో ఉందో వారికైనా నన్ను రిఫర్ చేయండి’ అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.
అనుమతి లేకుండానే..
తన అనుమతి లేకుండా ఉద్యోగి చేసిన ఈ పోస్ట్‌ను చూసి సదరు కంపెనీ వ్యవస్థాపకుడు, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి దినేష్ సింగ్ ఆశ్చర్యపోయారు. అయితే, ఆమెను మందలించడానికి బదులు ఆమెలోని ధైర్యాన్ని అభినందిస్తూ ఇంటర్నెట్ వేదికగా ఒక బహిరంగ సవాల్ విసిరారు. ‘నిజాయితీగా చెప్పాలంటే, నేను పని చేయాలనుకుంటున్న టీమ్ ఇలాగే ఉండాలి’ అని పేర్కొంటూ ఆయన రెండు ఆఫర్లను ప్రకటించారు.
1. అనుష్క చేసిన పోస్ట్‌కు లింక్డ్‌ఇన్, ఎక్స్ (ట్విట్టర్)లో 1,000 రీపోస్టులు వస్తే ఎలాగైనా ఆ విల్లాను బుక్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.
2. ఒకవేళ రీపోస్టుల సంఖ్య 5,000 దాటితే మొత్తం గ్రోత్ టీమ్‌ను వారి ఇష్టం వచ్చిన దేశానికి అంతర్జాతీయ పర్యటనకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.
విజయ్ మాల్యాను ఉద్దేశించి రాస్తూ, ‘మీరు ఇది చదువుతుంటే ఇకపై నిర్ణయం మీదే. ఆమె వయసు కేవలం 22 ఏళ్లు. మా లాంచ్ ఈవెంట్‌ను ఆమే నడిపిస్తోంది. ఈ ఈవెంట్ కోసం మీ విల్లానే కావాలని ఆమె నిర్ణయించుకుంది’ అని దినేష్ సింగ్ పేర్కొన్నారు.
నెటిజన్ల స్పందన
ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఒక నెటిజన్ స్పందిస్తూ ‘ఇది జెన్-జెడ్ నేతృత్వంలోని స్టార్టప్ మార్కెటింగ్ సరికొత్త దశలోకి ప్రవేశించిందని నిరూపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. మరొకరు, ‘ఆ విల్లా ప్రస్తుతం మాల్యా ఆధీనంలో లేకపోయినా ఈ ప్రయత్నం ద్వారా ఆ టీమ్‌కు లభిస్తున్న పబ్లిసిటీ అమోఘం’ అని రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు


