భారత కరెన్సీ రూపాయి విలువ పతనం ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత దిగువ స్థాయికి పడిపోయింది.
ఈ రోజు (మే 15, 2026) ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి విలువ 96 మార్కును దాటి రికార్డు స్థాయిలో 96.07 కనిష్ఠ స్థాయికి పతనమైంది. గడిచిన సెషన్‌లో 95.95 వద్ద ముగిసిన రూపాయి, నేడు ఉదయం డాలర్‌తో పోలిస్తే 95.74 స్థాయిల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ముడి చమురు ధరల పెరుగుదల, ఇరాన్-యూఎస్ ఉద్రిక్తతల కారణంగా మరింత క్షీణించి 0.3% నష్టంతో 96.05 వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు రూపాయి విలువ దాదాపు 7% మేర క్షీణించడం గమనార్హం.
రూపాయి పతనానికి గల కారణాలు..
బ్యారెల్ 110 డాలర్లకు చేరిన ముడి చమురు
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% చమురు రవాణా సాగే కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేయడంతో గత 11 వారాలుగా చమురు ధరలు గరిష్ట స్థాయిల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 109 డాలర్ల వద్ద కదులుతుండగా యూఎస్ బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూఐటీ) బ్యారెల్‌కు 105 డాలర్ల స్థాయికి చేరుకుంది. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు వ్యాపారం అంతా డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, ధరలు పెరిగినప్పుడల్లా భారత్‌కు డాలర్ల అవసరం పెరిగి రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.
ఆగని ఎఫ్‌పీఐల విక్రయాలు..
దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ/ఎఫ్‌ఐఐ) తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఇది గత ఏడాది (రూ.1.54 లక్షల కోట్లు) అవుట్‌ఫ్లో రికార్డును సైతం అధిగమించింది.
మే 14 ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికరంగా రూ.146 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు విదేశీ పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారు. తైవాన్, దక్షిణ కొరియా వంటి టెక్నాలజీ హబ్‌లుగా ఉన్న మార్కెట్లలోకి ఈ నిధులు మళ్లుతుండటంతో భారత రూపాయి విలువ మరింత బలహీనపడుతోంది.
ఫలితాన్ని ఇవ్వని ట్రంప్, జిన్‌పింగ్ సమావేశం
హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించే విషయంలో చైనా మధ్యవర్తిత్వం వహిస్తుందని, తద్వారా అమెరికా-ఇరాన్ సంక్షోభం సద్దుమణుగుతుందని మార్కెట్లు ఆశగా ఎదురుచూశాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన రెండు గంటల సుదీర్ఘ శిఖరాగ్ర సమావేశం ఎటువంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. చర్చలు నమ్మశక్యం కాని విధంగా సాగాయని ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ యుద్ధ ప్రతిష్టంభనపై స్పష్టత రాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు నిరాశ అలుముకుంది. అమెరికా విధాన నిర్ణేతల (యూఎస్ ఫెడ్) వ్యాఖ్యలు, అక్కడ వెలువడిన ఆర్థిక గణాంకాలు డాలర్‌ను మరింత బలోపేతం చేశాయి.
భారత్‌పై పడే ప్రభావం ఏమిటి?
రూపాయి విలువ ఇలాగే 96 దిగువన కొనసాగితే దేశీయంగా ‘ఇంపోర్టెడ్ ఇన్‌ఫ్లేషన్’ (దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం) ముప్పు పొంచి ఉంది. ఇంధన ధరలతో పాటు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారం కానున్నాయి. విదేశీ విద్య, ప్రయాణాలు మరింత ఖరీదైనవిగా మారతాయి. అయితే, రూపాయి విలువ విపరీతంగా పడిపోకుండా అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన విదేశీ నిల్వల (ఫారెక్స్ రిజర్వ్స్) ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు తిరిగి రావడంపైనే రూపాయి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు!


