ఊహించినదానికన్నా వేగంగా రికవరీ

Indian economy may recover faster than anticipated - Sakshi

భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ అంచనా

వడ్డీరేట్ల తగ్గింపు పక్రియ ముగింపునకు వచ్చినట్లు విశ్లేషణ

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిపోయిన భారత్‌ ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊహించినదానికన్న వేగంగా రికవరీ అయ్యే అవకాశం ఉందని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ అంచనావేస్తోంది. ఆర్థిక రంగానికి సంబంధించి పలు ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొంది. భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2020 క్యాలెండర్‌ ఇయర్‌లో అనుకున్నదానికన్నా కొంచెం బాగుండే అవకాశం ఉందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌  కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.  2020లో  క్షీణ రేటు అంచనాలు ఇంతక్రితం మూడీస్‌ మైనస్‌ 9.6 శాతం అంచనావేయగా, తాజాగా దీనిని  మైనస్‌ 8.9 శాతానికి తగ్గించింది. కఠిన, దీర్ఘకాల లాక్‌డౌన్‌ అనంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌  పేర్కొంది.  

ద్రవ్యోల్బణం ఇబ్బందులు...
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రక్రియకు ఇక తెరపడినట్లేనని కూడా ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌  అంచనావేసింది. వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి కారణంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) కూడా ద్రవ్యోల్బణం ఆరు శాతం కన్నా పైనే ఉంటుందని విశ్లేషించింది.  రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో  రెపో  మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని వారు అభిప్రాయడ్డారు.

  ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో 4 శాతంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది.  ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ, రిటల్‌ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్‌ నెలల్లో జరిగిన  ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది.

అయితే సెప్టెంబర్‌ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో  లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ అంచనావేస్తోంది.  వ్యవసాయ రంగం పరిస్థితి  ఆశాజనకంగా ఉండడం, ముడి చమురు ధరలు ఒక నిర్దిష్ట శ్రేణితో తిరుగుతుండడం, లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో సరఫరాల వ్యవస్థ మెరుగుపడుతుండడం ఆర్‌బీఐ అంచనాలకు ప్రధాన కారణాలు. వెరసి డిసెంబర్‌ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది.

క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్‌బీఐ తన పాలసీ సమీక్షలో భావించింది.  ఈ అంచనాల నేపథ్యంలో వృద్ధికి దోహదపడే సరళతర ద్రవ్య విధానంవైపే ఆర్‌బీఐ మొగ్గుచూపుతోంది. మరోవైపు ఇప్పటికే ఏడాది ఆపైన కాలపరిమితుల స్థిర డిపాజిట్‌ రేటు 4.90 నుంచి 5.50 శాతం శ్రేణిలో ఉన్నాయని,  ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది నెగెటివ్‌ రిటర్న్స అనీ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.  వడ్డీరేట్లు మరింత తగ్గి, ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంటే అది పొదుపులు, డిపాజిట్లు, కరెంట్‌ అకౌంట్లపై ప్రతికూల ప్రభావం చూపి సమీపకాలంలో వృద్ధికి విఘాతం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top