100 ట్రిలియన్‌ డాలర్లకి చేరుకోనున్న ప్రపంచ ఎకానమీ

 India Will Over Come France And Britain In Next Two Years Says Centre For Economic And Business Research Report - Sakshi

2022లో కీలక మైలురాయికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

అంచనాలకన్నా రెండేళ్లకు ముందే ‘ముందడుగు’

2030 నాటికి ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా

రెండవ స్థానానికి పడిపోనున్న అమెరికా

100 ట్రిలియన్‌ డాలర్లకి చేరుకోనున్న ప్రపంచ ఎకానమీ

సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రీసెర్చ్‌ నివేదిక    

లండన్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది మొట్టమొదటిసారి 100 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిని అధిగమించనుంది. సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రీసెర్చ్‌ (సీఈబీఆర్‌)తాజాగా ఈ అంచనాలను వెలువరించింది. నిజానికి ఈ స్థాయిని ప్రపంచ ఎకానమీ 2024కు అందుకుంటుందని తొలుత సీఈబీఆర్‌ అంచనావేసింది. ఇక 2030 నాటికి చైనా ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికాను పక్కకునెట్టి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందని సీఈబీఆర్‌ అంచనావేసింది. ఈ విషయంలో అంచనాలకన్నా చైనా రెండేళ్లు వెనకబడిందని నివేదిక వివరించింది. కాగా,  2021లో 194 దేశాల ఆర్థిక వ్యవస్థల పరిమాణం దాదాపు 94 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రపంచ ఆర్థిక పరిమాణంపై తాజా సీఈబీఆర్‌ అంచనా ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనాలకు అనుగుణంగా ఉండడం గమనార్హం.  

వచ్చే రెండేళ్లలో ఫ్రాన్స్,  బ్రిటన్‌ను అధిగమించనున్న భారత్‌.. 
నివేదిక ప్రకారం, భారత్‌ ఎకానమీ 2022లో ఫ్రాన్స్‌ను అధిగమించనుంది. తద్వారా ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 2023లో బ్రిటన్‌ను మించి పైకి ఎదిగే అవకాశం ఉంది. 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలుంది.  అత్యధిక వృద్ధితో ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక 2023లో జర్మనీ ఆర్థిక వ్యవస్థ జపాన్‌ను అధిగమించవచ్చని, 2036లో రష్యా ప్రపంచంలో పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందవచ్చని, 2034లో ఇండోనేషియా ప్రపంచంలో తొమ్మిదివ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా తొలి పది స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ, కెనడా, దక్షిణ కొరియాలు ఉన్నాయి.

ద్రవ్యోల్బణమే అతిపెద్ద సమస్య 
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ప్రస్తుతం ద్రవ్యోల్బణమే ప్రధాన సమస్య కానుందని నివేదిక విశ్లేషించింది. అమెరికా, చైనాల్లో ద్రవ్యోల్బణం దశాబ్దాల గరిష్ట స్థాయిలకు చేరడం గమనార్హమని వివరించింది. దీనితో వడ్డీరేట్ల పెరుగుదల పలు దేశాల్లో మొదలుకావచ్చని విశ్లేషించింది. మాంద్యంలోకి జారిపోకుండా ఆర్థిక వ్యసస్థలను కాపాడుకోవడం ప్రపంచ ఎకానమీలకు పెను సవాలుగా ఉంటుందని వివరించింది. 

చదవండి: భవిష్యత్‌లో కరెన్సీ మాయం..పెత్తనం అంతా బిట్‌ కాయిన్లదే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top