breaking news
World Economic System
-
రెండేళ్లలో ఫ్రాన్స్, బ్రిటన్ను అధిగమించనున్న భారత్..
లండన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది మొట్టమొదటిసారి 100 ట్రిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించనుంది. సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్)తాజాగా ఈ అంచనాలను వెలువరించింది. నిజానికి ఈ స్థాయిని ప్రపంచ ఎకానమీ 2024కు అందుకుంటుందని తొలుత సీఈబీఆర్ అంచనావేసింది. ఇక 2030 నాటికి చైనా ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికాను పక్కకునెట్టి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందని సీఈబీఆర్ అంచనావేసింది. ఈ విషయంలో అంచనాలకన్నా చైనా రెండేళ్లు వెనకబడిందని నివేదిక వివరించింది. కాగా, 2021లో 194 దేశాల ఆర్థిక వ్యవస్థల పరిమాణం దాదాపు 94 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రపంచ ఆర్థిక పరిమాణంపై తాజా సీఈబీఆర్ అంచనా ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలకు అనుగుణంగా ఉండడం గమనార్హం. వచ్చే రెండేళ్లలో ఫ్రాన్స్, బ్రిటన్ను అధిగమించనున్న భారత్.. నివేదిక ప్రకారం, భారత్ ఎకానమీ 2022లో ఫ్రాన్స్‌ను అధిగమించనుంది. తద్వారా ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 2023లో బ్రిటన్ను మించి పైకి ఎదిగే అవకాశం ఉంది. 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలుంది. అత్యధిక వృద్ధితో ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక 2023లో జర్మనీ ఆర్థిక వ్యవస్థ జపాన్ను అధిగమించవచ్చని, 2036లో రష్యా ప్రపంచంలో పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందవచ్చని, 2034లో ఇండోనేషియా ప్రపంచంలో తొమ్మిదివ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా తొలి పది స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ, కెనడా, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణమే అతిపెద్ద సమస్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ప్రస్తుతం ద్రవ్యోల్బణమే ప్రధాన సమస్య కానుందని నివేదిక విశ్లేషించింది. అమెరికా, చైనాల్లో ద్రవ్యోల్బణం దశాబ్దాల గరిష్ట స్థాయిలకు చేరడం గమనార్హమని వివరించింది. దీనితో వడ్డీరేట్ల పెరుగుదల పలు దేశాల్లో మొదలుకావచ్చని విశ్లేషించింది. మాంద్యంలోకి జారిపోకుండా ఆర్థిక వ్యసస్థలను కాపాడుకోవడం ప్రపంచ ఎకానమీలకు పెను సవాలుగా ఉంటుందని వివరించింది. చదవండి: భవిష్యత్‌లో కరెన్సీ మాయం..పెత్తనం అంతా బిట్ కాయిన్లదే! -
అమెరికా మార్కెట్ల పతనం
అదే బాటలో యూరో సూచీలు న్యూయార్క్: బ్యాంకింగ్, రిటైల్, టెక్నాలజీ దిగ్గజాల ఫలితాలపై అనుమానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన సంకేతాలు, ముడిచమురు ధరల పతనం వంటి అంశాలు మరోసారి అమెరికా స్టాక్ మార్కెట్లకు షాకిచ్చాయి. ఇవిచాలవన్నట్లు తాజాగా ఎబోలా వ్యాధి వేగంగా విస్తరిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతోఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి. వెరసి గత మూడేళ్లలోలేని విధంగా అమెరికా స్టాక్ సూచీలు బుధవారం 2.5%పైగా పతనమయ్యాయి. కడపటి వార్తలందేసరికి డోజోన్స్ 426 పాయింట్లు పతనమై 15,889కు చేరగా, నాస్డాక్ 100 పాయింట్లు పడిపోయి 4,127 వద్ద ట్రేడవుతోంది. ఇక ఎస్అండ్పీ-500 సూచీ సైతం 49 పాయింట్లు దిగజారి 1,828 వద్ద నేలచూపులు చూస్తోంది. ఇప్పటికే యూరోజోన్‌లో ప్రధాన ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారుకోవడం యూరప్‌లోనూ సెంటిమెంట్‌కు దెబ్బతగిలింది. దీంతో అటు యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. జర్మనీ ఇండెక్స్ డాక్స్ 253 పాయింట్లు జారి 8,572కు చేరగా, యూకే ఇండెక్స్ ఎఫ్టీఎస్ఈ 181 పాయింట్లు క్షీణించి 6,212ను తాకింది. ఇక ఫ్రాన్స్ ఇండెక్స్ సీఏసీ 149 పాయింట్లు నష్టపోయి 3,940 వద్ద నిలిచింది. కాగా, ఈ ప్రభావం గురువారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చునని నిపుణులు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రతిబింబిస్తూ సింగపూర్‌లో ట్రేడయ్యే నిఫ్టీ 120 పాయింట్లు పతనంకావడం గమనార్హం.