‘వాతావరణ’ పెట్టుబడులు.. టాప్‌ 10 దేశాల్లో భారత్‌..

 India Standing In Top Ten Countries To Attract Investments In Climate Change Sector - Sakshi

లండన్‌: గత అయిదేళ్లుగా వాతావరణ పరిరక్షణ టెక్నాలజీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న టాప్‌ 10 దేశాల జాబితాలో భారత్‌ చోటు దక్కించుకుంది. తొమ్మిదో స్థానంలో నిల్చింది. దేశీ క్లైమేట్‌ టెక్‌ సంస్థలు 2016–2021 మధ్య కాలంలో 1 బిలియన్‌ డాలర్ల మేర వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు దక్కించుకున్నాయి. ప్యారిస్‌ ఒప్పందం అనంతరం అయిదేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాలపై లండన్‌ అండ్‌ పార్ట్‌నర్స్, డీల్‌రూమ్‌డాట్‌కామ్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

నంబర్‌ వన్‌ అమెరికా
తాజా నివేదిక ప్రకారం ప్యారిస్‌ ఒప్పందం తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్‌ టెక్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ పెట్టుబడులు అందుకున్న టాప్‌ 10 దేశాల్లో 48 బిలియన్‌ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో, 18.6 బిలియన్‌ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 5.8 బిలియన్‌ డాలర్లతో స్వీడన్‌ మూడో స్థానంలో  నిలిచాయి. కాలుష్యకారక ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించే దిశగా అంతా సమిష్టిగా పనిచేయడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని నివేదిక పేర్కొంది.   

పర్యావరణంపై బహుళజాతి బ్యాంకులు దృష్టి పెట్టాలి - నిర్మాలాసీతారామన్‌ 
న్యూఢిల్లీ: పర్యావరణం, తత్సబంధ ప్రాజెక్టులు, పురోగతిపై ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) వంటి బహుళజాతి బ్యాంకులు దృష్టి సారించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. ఇందుకు ప్రైవేటు మూలధనం సమకూర్చడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆమె చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఏఐఐబీ గవర్నర్ల బోర్డ్‌ ఆరవ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల అవకాశాలను ఏఐఐబీ అన్వేషించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఏఐఐబీకి భారత్‌ అన్ని విషయాల్లో తగిన సహకారం అందిస్తుందన్నారు. రెసిడెంట్‌ బోర్డ్, రీజినల్‌ ఆఫీస్‌లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఏఐఐబీకి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల బ్యాంక్‌ కార్యకలాపాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందన్నారు.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top