India Services Sector: ఆగస్టులో సేవల రంగం సూపర్‌

India Services Business Activity Expands At Fastest Pace In 18 Months In August - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ సేవల రంగం ఆగస్టులో దూసుకుపోయింది. ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ క్షీణత నుంచి భారీ వృద్ధిలోకి జంప్‌ చేసింది. జూలైలో 45.4 క్షీణతలో ఉన్న రంగం, ఆగస్టులో 18 నెలల గరిష్ట స్థాయి 56.7కు ఎగసింది. సూచీ 50 లోపు ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు.

సమీక్షా నెల్లో బిజినెస్‌ ఆర్డర్లు గణనీయంగా పెరిగినట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో విధించిన ఆంక్షలను సడలించడం, పలు సంస్థల పునఃప్రారంభం, కొత్త ఆర్డర్లు, వినియోగం భారీగా పెరగడం వంటి పలు అంశాలు ఆగస్టు సేవల రంగంపై ప్రభావం చూపాయి.  కరోనా  సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో గడచిన నాలుగు నెలలుగా సేవల ఇండెక్స్‌ 50లోపు క్షీణతలోనే కొనసాగుతోంది.  

సేవలు–తయారీ ఇండెక్స్‌ కూడా దూకుడే... 
సేవలు, తయారీ ఇండెక్స్‌ కలిసిన కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ కూడా 49.2 క్షీణత (జూలై) నుంచి ఆగస్టులో 55.4 వృద్ధిలోకి మారింది. మూడు నెలలుగా ఈ విభాగం క్షీణతలోనే కొనసాగింది. ఒక్క తయారీ రంగం చూస్తే, తయారీ రంగం ఆగస్టులో వృద్ధి బాటలోనే ఉన్నప్పటికీ, జూలైకన్నా నెమ్మదించింది.

ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఆగస్టులో 52.3 వద్ద ఉంది. జూలైలో ఈ సూచీ 55.3 వద్ద ఉంది. భారత్‌ ఎకానమీలో సేవల రంగం వాటా దాదాపు 60 శాతంకాగా, పారిశ్రామిక రంగం వాటా 15 శాతం. పారిశ్రామిక రంగంలో తయారీ రంగం వెయిటేజ్‌ దాదాపు 70 శాతం. 

చదవండి: 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top