కరోనా గండం: ఆ పరిశ్రమ డిమాండ్‌ క్షీణించే అవకాశం

India Ratings and Research Report On Automobile Industry - Sakshi

ప్యాసింజర్‌ వాహనాల రికవరీకి మరికొంత సమయం 

ద్వితీయార్థంలో కాస్త మెరుగ్గా వాణిజ్య వాహన విక్రయాలు 

ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ నివేదిక

ముంబై : కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌తో సమీప భవిష్యత్తులో దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమ డిమాండ్‌ క్షీణించే రిస్కులు ఉన్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌–రా) ఒక నివేదికలో తెలిపింది. ప్యాసింజర్‌ వాహనాల విభాగం అమ్మకాలు పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టేస్తుందని పేర్కొంది. అయితే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్‌ 2021–22 ద్వితీయార్థంలో మెరుగుపడొచ్చని నివేదిక పేర్కొంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం పలు తీసుకునే పలు చర్యలు కూడా సీవీల విక్రయాలు.. ముఖ్యంగా మీడియం, హెవీ సీవీల అమ్మకాలకు దోహదపడగలవని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమ విక్రయాలు మొత్తం మీద 14 శాతం క్షీణించాయి. ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 2 శాతం, సీవీల అమ్మకాలు 21 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13 శాతం పడిపోయాయి. 2021 మార్చి గణాంకాలు చూస్తే పీవీలు మినహా రిటైల్‌ విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణించడం చూస్తే కన్జూమర్‌ సెంటిమెంటు ఇంకా పూర్తిగా మెరుగుపడినట్లు కనిపించడం లేదని ఇండ్‌–రా నివేదికలో తెలిపింది.  

నివేదిక ఇతర విశేషాలు.. 
2021 మార్చి దాకా దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమ వరుసగా ఎనిమిదో నెల సానుకూల వృద్ధి నమో దు చేసింది. 2020 మార్చి నాటి లో బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా 2021 మార్చిలో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 115 శాతం, ద్విచక్ర వాహనాల విక్రయాలు 73 శాతం వృద్ధి కనపర్చాయి. 
ఎగుమతుల పరిమాణం 2020 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 57 శాతం పెరిగింది. ద్విచక్ర వాహనాల ఎగుమతులు 63 శాతం పెరిగాయి. 
2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం ఎగుమతుల పరిమాణం 13 శాతం క్షీణించింది. 
కరోనా పరిస్థితులతో వ్యక్తిగత రవాణా వాహనాలకు డిమాండ్‌ పెరగడం వల్ల ప్యాసింజర్‌ వాహనాల సెగ్మెంట్‌కు కాస్త ప్రయోజనం చేకూరింది. మిగతా విభాగాలతో పోలిస్తే తక్కువ క్షీణత నమోదైంది. మధ్య స్థాయి, ఎగ్జిక్యూటివ్, ప్రీమియం కార్లు.. వ్యాన్ల సెగ్మెంట్‌తో పోలిస్తే కాంపాక్ట్, సూపర్‌ కాంపాక్ట్, మినీ, మైక్రో కార్ల అమ్మకాలు మెరుగ్గా నమోదయ్యాయి. తొలిసారిగా కారు కొనుగోలు చేస్తున్న వారు వీటికి ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణం. 
యుటిలిటీ వాహనాలకు డిమాండ్‌ కొనసాగింది. కొత్త వాహనాల ఆవిష్కరణ కారణంగా ఈ విభాగం 12 శాతం వృద్ధి చెందింది. 
గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ .. ద్విచక్ర వాహనాల విభాగానికి సానుకూలంగా దోహదపడింది. అయితే, విద్యా సంస్థలను తెరవడంలో జాప్యం జరగడం, ఇంధన ధరల పెరుగుదలతో వాహనాల నిర్వహణ వ్యయం పెరిగిపోవడం, కోవిడ్‌ సంబంధ లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి కొంత మేర ప్రతికూల ప్రభావమైతే పడింది. ముఖ్యంగా ఎంట్రీ స్థాయి మోడల్స్‌పై ఇది కనిపించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top