పెరుగుతున్న భారత్‌ చమురు డిమాండ్‌

India to overtake China as oil demand growth centre in 2027 - Sakshi

ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక

ప్రపంచ డిమాండ్‌లో 2027 నాటికి  చైనాను అధిగమించే అవకాశం  

బెతుల్‌ (గోవా): ప్రపంచ చమురు డిమాండ్‌లో చైనాను భారత్‌ 2027లో అధిగమిస్తుందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) బుధవారం పేర్కొంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో రవాణా, పరిశ్రమల వినియోగం వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచ చమురు డిమాండ్‌ విషయంలో చైనాను భారత్‌ వెనక్కునెట్టనుందని అభిప్రాయపడింది.

క్లీన్‌ ఎనర్జీ, విద్యుదీకరణ వంటి రంగాల పురోగతికి దేశం ప్రణాళికలు వేస్తున్నప్పటికీ చమురు డిమాండ్‌ కొనసాగుతుందని పారిస్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐఈఏ పేర్కొంది. ఇక్కడ జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌ను పురస్కరించుకుని ‘ఇండియన్‌ ఆయిల్‌ మార్కెట్‌ అవుట్‌లుక్‌ 2030’ అనే పేరుతో ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. నివేదికలోని మరిన్ని అంశాలను పరిశీలిస్తే...

► దేశం చమురు డిమాండ్‌ 2023లో రోజుకు 5.48 మిలియన్‌ బ్యారెళ్లు (బీపీడీ). 2030 నాటికి ఈ పరిమాణం 6.64 మిలియన్‌ బీపీడీకి పెరుగుతుంది. చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశీయ వినియోగం రోజుకు 5 మిలియన్‌ బ్యారెల్స్‌ (బీపీడీ). ఐఈఏ నివేదికలో అంకెలు చూస్తే, దేశీయంగా అలాగే ఎగుమతుల కోసం జరుగుతున్న ఇంధన ప్రాసెస్‌ను పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది.  
► గ్రీన్‌ ఎనర్జీ విషయంలో పురోగతి ఉన్నప్పటికీ 2030 నాటికి భారత్‌ చమురు డిమాండ్‌ వేగంగా పెరుగుతుంది.  
► ప్రపంచ చమురు డిమాండ్‌లో భారత్‌లో వృద్ధి 2027లో చైనాను అధిగమిస్తుంది కానీ, దేశీయంగా చూస్తే, భారతదేశంలో డిమాండ్‌ 2030లో కూడా చైనా కంటే వెనుకబడి ఉంటుంది.
► ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉంది. దేశం తన చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. దేశీయ ఉత్పత్తి పడిపోవడంతో ఈ శాతం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.  
► భారీ చమురు  క్షేత్రాలు కనుగొనలేకపోవడం వల్ల 2030 నాటికి దేశీయ ఉత్పత్తి 540,000 బీపీడీకి పడిపోతుంది.  2023లో దిగుమతులు 4.6 మిలియన్‌ బీపీడీలు ఉండగా, 2030 నాటికి 5.8 మిలియన్‌ బీపీడీలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.  
► భారతదేశం 66 రోజుల అవసరాలను తీర్చడానికి సమానమైన చమురు నిల్వలను కలిగి ఉంది. ఇందులో 7 రోజుల అవసరాలు భూగర్భ వ్యూహాత్మక నిల్వలలో నిల్వ ఉన్నాయి. మిగిలినవి రిఫైనరీలు మరియు ఇతర ప్రదేశాలలో డిపోలు– ట్యాంకులలో నిల్వలో ఉన్నాయి.  భారత్‌ కాకుండా  ఐఈఏ ఇతర సభ్య దేశాలు తమ డిమాండ్‌లో 90 రోజులకు సమానమైన నిల్వను నిర్వహిస్తున్నాయి. 

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top