భారత ఇంధన రంగంలో స్వావలంబన సాధించడమే లక్ష్యంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ‘ఈ85 ఫ్లెక్స్ ఇంధనం’ను అధికారికంగా ఈరోజు(జూన్ 5)విడుదల చేయనుంది. ఈ సరికొత్త ఇంధనంలో 80 నుంచి 85 శాతం ఇథనాల్, కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే పెట్రోల్ (మోటార్ గ్యాసోలిన్) ఉంటాయి. మారుతి సుజుకి సంస్థ దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును ఆవిష్కరించిన సందర్భంగా.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ ప్రకటన చేశారు. ఈ చొరవతో దేశంలో ఇథనాల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మరింత పెరగనుంది.
తొలిదశలో 50 నుంచి 100 ఇంధన స్టేషన్లు
ప్రారంభ దశలో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పుణె, నాగ్‌పూర్ పరిధిలోని 50 నుంచి 100 రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఇథనాల్ పంపిణీ స్టేషన్లను ప్రారంభించనున్నారు. దేశంలోనే అత్యధిక వాహన జనాభా, ఇంధన వినియోగం ఉన్న ఈ నగరాలను పైలట్ ప్రాజెక్ట్ కోసం వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. దీనివల్ల వినియోగదారులకు ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలపై అవగాహన, విశ్వసనీయత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఫ్లెక్స్-ఇంధన స్టేషన్ల విస్తరణ ఇలా..
ప్రస్తుత ప్రారంభం : 50 - 100 స్టేషన్లు
2026 చివరి నాటికి : 500 స్టేషన్లు
2027 చివరి నాటికి : 5,000 స్టేషన్లు
రూ.1.84 లక్షల కోట్లు ఆదా!
గడిచిన దశాబ్ద కాలంలో ఇథనాల్ బ్లెండింగ్ (మిశ్రమం) రంగంలో భారత్ ప్రగతి సాధించింది. 2014లో కేవలం 1.5 శాతంగా ఉన్న ఇథనాల్ మిశ్రమం.. నేడు ఏకంగా 20 శాతానికి చేరింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు కంటే ముందే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఈ బ్లెండింగ్ కార్యక్రమం ద్వారా దాదాపు 302 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయి. విదేశీ మారక ద్రవ్యంలో ఏకంగా రూ.1.84 లక్షల కోట్లు ఆదా అయ్యాయి.
సరఫరా గొలుసు ముప్పునకు బ్రేక్
‘భారతదేశం ప్రస్తుతం శిలాజ ఇంధనాల దిగుమతి కోసం ఏటా 120 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇది మన కరెంట్ ఖాతాపై భారాన్ని మోపుతోంది. పైగా మన దేశానికి వచ్చే ఎల్పీజీలో 60 శాతం, ముడి చమురులో 90 శాతం హార్మూజ్ జలసంధి గుండానే ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు స్వచ్ఛమైన ఇథనాల్‌తో (E100) నడిచే వాహనాలను ప్రోత్సహించక తప్పదు’ అని హర్దీప్ సింగ్ పురి అన్నారు.
ఇదీ చదవండి: ‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’


