మళ్లీ మొదటికి వచ్చింది.. టెక్కీలకు తీపికబురు చెప్పనున్న కంపెనీలు!

India: Covid 19 Fourth Wave Fears, Tech Companies Considering Work From Home - Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ము​ఖ్యంగా చైనాలో ఈ మహమ్మారి రూపాంతరం చెంది విలయతాండవం చేస్తోంది. దీంతో భారత ప్రభుత్వం కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే భయాలు, లాక్‌డౌన్ దేశాన్ని పట్టుకున్నందున వర్క్‌ ఫ్రమ్‌ హోం (Work From Home) తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నివేదికల ప్రకారం, భారత్‌లో వైరస్‌ భయంతో ఇప్పటికే ఆతిథ్యం, రవాణా, పర్యాటకం, రియల్ ఎస్టేట్‌తో సహా వివిధ రంగాలు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. ఒమిక్రాన్‌ (Omicron) కొత్త BF.7 వేరియంట్ చైనాను వణికిస్తున్న తరుణంలో దేశంలో ఇప్పటికే ముందస్తు చర్యలు కూడా మొదలయ్యాయి. అయితే జాగ్రత్తలు ఎన్ని తీసుకున్న కరోనా ఫోర్త్‌ వేవ్ దేశాన్ని మరో సారి వణికిస్తుందేమోనని భయం ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు ఇది తలనొప్పిగా మారిందనే చెప్పాలి. నిన్నటి వరకు ఆఫీస్‌కు రావాలని, హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌లో పనిచేయాలని కంపెనీలు తమ ఉద్యోగులను సన్నద్ధం చేస్తూ వచ్చాయి. టెక్కీలు కూడా  అయిష్టంగానే వీటికి అంగీకరించారు. అయితే తాజా పరిస్థితులతో చూస్తుంటే కంపెనీలకు మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వైపే మొగ్గు చూపేలా ఉన్నాయంటూ నివేదికలు కూడా ఊపందుకుంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు బాగా పెరగడంతో, దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమను తాము సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా జపాన్, దక్షిణ కొరియా, చైనాతో పాటు ఇతర దేశాల నుంచి భారత్‌కు ప్యాసింజర్లకు కోవిడ్‌ (COVID-19) పరీక్షను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. మరో వైపు మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

చదవండి: ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే రూ.15 లక్షలు వస్తాయ్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top